
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి కృషి చేస్తున్నాం
గత 15ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని గాడిన పెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే,మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.జఫర్గడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జఫర్గడ్,ఐనవోలు మండలాలకు చెందిన 56 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ. 56.06 లక్షల చెక్కులు,36 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.9.57 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతంలో అధికారంలో ఉన్నవారు 15 ఏళ్లు ప్రజలకు న్యాయం చేయలేదు.నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన 21 నెలల్లోనే రూ.1026 కోట్ల అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి తీసుకువచ్చాను.రానున్న మూడేళ్లలో మరో రూ.2000 కోట్ల నిధులు మంజూరు చేయిస్తాను,అని తెలిపారు.సంక్షేమ పథకాల అమలులో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు.కొంతమంది వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా,తన దృష్టి మాత్రం నియోజకవర్గ అభివృద్ధిపైనే ఉంటుందని స్పష్టం చేశారు.
“ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు”
దేవాదుల 3వ దశ ప్యాకేజీ-6 కింద 78 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1015 కోట్లు మంజూరు,జఫర్గడ్ మండలంలోని దంసా చెరువు,జఫర్గడ్ పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసి కాలువల ద్వారా సాగునీరు అందించనున్నారు.కొనాయిచలం వద్ద రూ.200 కోట్లతో యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం,అక్టోబర్లో పనులు ప్రారంభం,గిరిజన తాండాలకు రూ. 20 కోట్ల బీటీ రోడ్లు,జఫర్గడ్ మండలంలో రెండు తాండాలకు రూ.3.5 కోట్ల రోడ్లు,ఎస్సి కాలనీలలో రూ.15 కోట్లతో సీసీ రోడ్లు,డ్రైనేజీలు నిర్మాణం”.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని,ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,సన్న బియ్యం పంపిణీ,ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.“ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా ధ్యేయం.నియోజకవర్గ అభివృద్ధికి అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేయండి,”అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి,వైస్ చైర్మన్ నూకల ఐలయ్య,పీఏసీఎస్ కరుణాకర్ రావు,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య,తహసీల్దార్,ఎంపీడీవో,అధికారులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.