స్టేషన్ ఘనపూర్ రైతులకు సాగునీటి భరోసా–దేవాదుల ద్వారా నీటి విడుదలకు ఏర్పాట్లు-కడియం శ్రీహరి
Uncategorized
ఈ69న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్ జూలై 21
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో,రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే,మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.”వర్షాభావం కారణంగా రైతుల నాట్లు ఎండిపోతున్నాయి.సాగు నీరు లేక తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ధర్మసాగర్,ఘనపూర్,మల్లన్నగండి,అశ్వరావుపల్లి రిజర్వాయర్లకు నీరు విడుదల చేసి, అక్కడి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.మోటార్లలో సాంకేతిక సమస్యల వల్ల పూర్తి స్థాయిలో పంపకాలపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ,ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిలువలతో రైతులకు 10 రోజులపాటు సాగునీరు అందించనున్నట్లు ప్రకటించారు.నీటిని ధర్మసాగర్ సౌత్ కెనాల్,మల్లన్నగండి కుడి-ఎడమ కాలువలు,ఘనపూర్ నవాబుపేట మెయిన్ కెనాల్,అశ్వరావుపల్లి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా విడుదల చేయనున్నట్లు తెలిపారు.”రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున నిరంతరాయంగా కాకుండా ఆన్-ఆఫ్ విధానంలో సాగునీరు సరఫరా అవుతుంది.రైతులు సహకరించి ప్రతి చుక్క నీటినీ సద్వినియోగం చేసుకోవాలి”అని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీసీ బిల్లుపై కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించిన కడియం.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించిన కడియం శ్రీహరి”బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే బీసీ బిల్లుకు వెంటనే మద్దతు తెలపాలి”అన్నారు.బీసీలకు మద్దతు ఇవ్వకుండా,కపట ప్రేమతో ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ తీరును ఖండించారు.కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ తీర్మానం ద్వారా కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్రానికి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై శతశాతం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు,మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.