
ఒంటిపూట బడులు నిర్వహించని పాఠశాలపై చర్యలేవి.
జిల్లా, మండలవిద్యాశాఖ అధికారులకు బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఫిర్యాదు
స్టేషన్ ఘనపూర్:- స్టేషన్ ఘనపూర్ మండలంలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒయాసిస్ ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నా యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారిని భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఎంఇఓ తో కలిసి ఒయాసిస్ పాఠశాల విద్యార్థులతో కలిసి మాట్లాడారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి చరావాణి ద్వారా సమాచారం అందించి పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిఇఓ గారికి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి, మండల అధ్యక్షుడు బోంకూరి మహేష్ కోరారు. అనంతరం లకావత్ చిరంజీవి, బోంకూరి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఈ నెల మార్చి 15 వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం ఆ12:30 గంటల వరకే పాఠశాలలు నడిపించాలని , దీని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ ఆదేశాలను పాటించకుండా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో మతలబు ఏమిటి అని ప్రశ్నించారు. విద్యాశాఖ ఆదేశాలు పాటించకుండా పాఠశాల యాజమాన్యం ఇష్టానుసారంగా సాయంత్రం వరకు పాఠశాల నడుస్తున్నప్పటికీ జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ,అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు . పల్లెటూరు నుండి ఉదయం 7:00 గంటలకే పాఠశాలకు తీసుకొచ్చి , సాయంత్రం 3:30 గంటల వరకు పాఠశాల నడుస్తుంటే మండల విద్యాశాఖ అధికారులకు కనిపించడం లేదా ? అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఒంటిపూట బడులు నిర్వహిస్తే స్టేషన్ ఘనపూర్ ఒయాసిస్ పాఠశాల యాజమాన్యం మాత్రం రెండు పూటలు బడులు నిర్వహిస్తున్నారని అన్నారు . రెండు పూటలు పాఠశాల నిర్వహించడం వెనుకాల కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడమే అన్నారు. ఫీజులు చెల్లించని వారికి హల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఒకపక్క తెలంగాణలో ఎండలు దంచికొడుతుంటే మరోపక్క ఒయాసిస్ పాఠశాల యాజమాన్యం మాత్రం విద్యార్థులను సాయంత్రం వరకు పాఠశాలలో ఉంచుతున్నారని, రోజురోజుకు ఎండ తీవ్రత మరింత పెరుగుతున్నప్పటికి విద్యార్థులను పాఠశాలలో ఉంచడం దారుణమన్నారు. గతంలో కూడా సాయంత్రం వరకు పాఠశాల నిర్వహించారని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే జిల్లా కలెక్టర్ , పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.