
ప్రపంచ కార్మికుల ఊపిరి, కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్
-శ్రీకాళహస్తి
ప్రపంచ కార్మికుల ఊపిరి, కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్ అని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య అన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సోమవారం కార్ల్ మార్క్స్ 207వ జయంతిని నిర్వహించారు. మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మిక వర్గాన్ని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతాన్ని మార్క్స్ రూపొందించారని పుల్లయ్య తెలిపారు. పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం, పేదరికం రోజురోజుకు తీవ్రమవుతున్నాయని చెప్పారు. ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గ పోరాటాన్ని కార్ల్ మార్క్స్ ఉదృతం చేశారని కొనియాడారు. సమాజంలో అందరికీ తిండి, ఇల్లు, బట్ట లాంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, దానికి అనుగుణంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారన్నారని గుర్తు చేశారు. సమాజంలో ధనిక, పేదల మధ్య అంతరాలు తగ్గించేందుకు మార్క్సిజం కీలకంగా ఉపయోగపడుతుందని అన్నారు. నాయకులు గంధం మణి, పెనగడం గురవయ్య, కుమార్, రాపూరు సుబ్రమణ్యం, రాధమ్మ, ఈశ్వరయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.