కడుపు మంటతో రైతులు,మండిపడుతున్న మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య ఈ69న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్ జూలై 17 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్,స్టేషన్ ఘనపూర్,అశ్వరావుపల్లి రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ ఉన్నా,రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడంపై మాజీ ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య తీవ్రంగా స్పందించారు.ఇప్పటికే వానలు లేక పొలాలు పంటలు వేయకుండా పడి ఉన్నాయి.విత్తనాలు వేసిన రైతులు నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు అధికారులు పట్టించుకోకుండా ఉండడం బాధాకరమని ఆయన విమర్శించారు.డా.రాజయ్య మాట్లాడుతూ…ఒక ప్రజాప్రతినిధిగా కడియం శ్రీహరి కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.రైతుల కష్టాలు పట్టించుకోకుండా,నీటి విడుదల విషయంలో కూడా స్వార్థ రాజకీయాలను ప్రదర్శిస్తున్నారు.ఇది రైతుల పట్ల అవమానకరమైన వైఖరిగా భావించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం నీటి లభ్యత ఉన్నప్పటికీ,సాగునీరు విడుదల చేయకపోవడం వల్ల పంటలు వేయకపోయే ప్రమాదం నెలకొంది.ఇది రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని రాజయ్య పేర్కొన్నారు.బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం.వెంటనే సాగునీరు విడుదల చేయకపోతే,రైతుల సమస్యల పరిష్కారం కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని స్పష్టం చేస్తున్నాం,అని రాజయ్య హెచ్చరించారు.