క్షయ వ్యాధి నివారణకు ఉచిత పోషకాహార కిట్లు పంపిణీ
Uncategorizedటీబి రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

ఈ69 న్యూస్ జనగామ
టీబి ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,ఐఎంఎ సంయుక్తంగా నిర్వహించగా,ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొని సుమారు 50 మంది క్షయ వ్యాధి రోగులకు పోషకాహార కిట్లు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ప్రతి లక్ష జనాభా పట్ల 204 మందికి క్షయ వ్యాధి సోకే అవకాశం ఉంది.మన జిల్లాలో గత ఏడాది 1051 కేసులు నమోదయ్యాయి.ఈ సంవత్సరం ఇప్పటివరకు 361 కేసులు గుర్తించబడ్డాయి,అని వివరించారు.అలాగే 2025 నాటికి దేశాన్ని క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా,జిల్లాలో 1,20,000 మందిలో 64,261 మందికి టిబి స్క్రీనింగ్ పరీక్షలు(ఎక్స్ -రే,నాట్ సివైటిబి )నిర్వహించామని,అందులో 43 మందికి టీబీ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు.క్షయ వ్యాధి చికిత్సలో మందులతో పాటు పోషకాహారానికీ కీలక పాత్ర ఉందని పేర్కొన్న కలెక్టర్,అందువల్ల న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ఈ రోగులకు ఉపశమనం కలిగించడమే కాకుండా చికిత్సను వేగవంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.ఆరు నెలలపాటు నిరంతరంగా మందులు వాడితే టీబీ పూర్తిగా నయమవుతుందని,లేకపోతే వ్యాధి తీవ్రమై ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.మల్లిఖార్జున రావు,ఐఎంఎ అధ్యక్షుడు డా.బాలాజీ,కార్యదర్శి డా.శ్రీకాంత్, డా.రాజమౌళి,డా.లవ్ కుమార్రెడ్డి,డా.లక్ష్మీ నారాయణ,డా.శ్రీనివాస్,డా.శ్యామ్,డా.కమలహాసన్,డా.అశోక్ కుమార్, డా.స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.