పాత్రికేయులు విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక వార్తలను రాయాలి-అదనపు కలెక్టర్ సంధ్యారాణి
Uncategorized
ఈ69 న్యూస్ వరంగల్,జూలై 28
వార్తలు రాస్తూ సమాజానికి సేవ చేస్తుంటే,జర్నలిస్టులు నైతిక విలువలు,పారదర్శకత పాటిస్తూ విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక కథనాలను ప్రజల ముందుంచాలన్నారు వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి.రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని కరీంబాద్ తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో జర్నలిస్టుల కోసం నిర్వహించిన రెండు రోజుల వృత్తి నైపుణ్యత శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆమె ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి,మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.సంధ్యారాణి మాట్లాడుతూ..నిజనిర్ధారణ జర్నలిజానికి ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితమైన సమాచారం ఆధారంగా వార్తలు తయారు చేయాలి.జర్నలిస్టులు వృత్తిపరమైన విలువలను పాటిస్తూ నమ్మదగిన సమాచారం అందిస్తే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవచ్చు అన్నారు.అదనంగా భవిష్యత్తులో డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర మరింత కీలకమవుతుందని పేర్కొన్నారు.జెడ్పి సీఈఓ రామిరెడ్డి మాట్లాడుతూ..జర్నలిస్టులు ప్రజలు మరియు ప్రభుత్వం మధ్య వంతెనగా పనిచేయాలని,పక్షపాతం లేకుండా నిబద్ధతతో వార్తలు అందించాలని సూచించారు.ఈ సందర్భంగా డేటా జర్నలిజంపై అవగాహన పెంపొందించుకోవాలని,ఫేక్ న్యూస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా హితవు పలికారు.శిక్షణ తరగతుల్లో 99 టీవీ స్టేట్ బ్యూరో చీఫ్ తోట భావనారాయణ గ్రామీణ వార్తల ప్రాముఖ్యతను వివరించగా,పరిశోధనాత్మక కథనాల నిపుణుడు ఉడుముల సుధాకర్ రెడ్డి నేర వార్తలు,సైబర్ క్రైమ్,ఫేక్ న్యూస్ వంటి అంశాలపై విశ్లేషణాత్మక ఉపన్యాసం ఇచ్చారు.దిశ దినపత్రిక చీఫ్ ఎడిటర్ మార్కండేయ ప్రత్యేక కథనాల రూపకల్పనపై చర్చించారు.అనంతరం శిక్షణలో పాల్గొన్న పాత్రికేయులకు ధృవపత్రాలను అందజేశారు.కార్యక్రమంలో అకాడమీ మేనేజర్ శైలేష్ రెడ్డి,డబ్ల్యూజేఐజేయు అధ్యక్షుడు శ్రీరామ్ రామచందర్,ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్,డీపీఆర్ఓ అయూబ్ అలీ,తాళ్ల విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం,డైరెక్టర్ డాక్టర్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.