
ఈ69 న్యూస్ జఫర్గడ్,ఆగష్టు7
ప్రభుత్వ జూనియర్ కళాశాల జఫర్గడ్లోని ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భూక్యా రాజు ప్రసంగిస్తూ.. విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న జయశంకర్,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేశారు.నీటి,నిధుల,ఉద్యోగాల పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, తన విశ్లేషణాత్మక ప్రసంగాలు, వ్యాసాల ద్వారా ఉద్యమానికి ప్రజాస్వామ్య పునాది వేశారు అని తెలిపారు.ప్రొఫెసర్ జయశంకర్ తొలి దశ మరియు మళ్లీ ప్రారంభమైన ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని, ఆయన సేవలను గుర్తించి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరియు జిల్లాకు ‘జయశంకర్’ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.