పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి-ఇందిరమ్మ కాలనీల వరకు వెంటనే 40 ఫీట్స్ బీటీ రహదారి నిర్మించాలని నిరసన

ఈ69 న్యూస్ జనగామ,ఆగస్టు 13
జనగామ పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి ఎల్లంల ఆటో అడ్డ నుండి బాణాపురం ఇందిరమ్మ కాలనీ,ఏసిరెడ్డి నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు 40 ఫీట్లు వెడల్పుతో బీటీ డాంబర్ డబుల్ రహదారి వెంటనే వేయాలని సిపిఎం పార్టీ జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి డిమాండ్ చేశారు.ప్రమాదాల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ రహదారి అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.బుధవారం బాణాపురం ఇందిరమ్మ వెంకటేశ్వర్ల,ఆంజనేయ,అయ్యప్ప స్వామి ఆలయాల ముందు నుండి ఇందిరమ్మ కాలనీ వరకు గుంతల మయమైన రహదారిని పరిశీలించిన అనంతరం,నిరసనగా స్థానికులు రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన చేపట్టారు.ఈ కార్యక్రమానికి బాణాపురం శాఖ కార్యదర్శి ధరవత్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా బూడిద గోపి మాట్లాడుతూ..పేదలకు ఇళ్లు కట్టించిన ఇందిరమ్మ ఫేజ్-1,ఫేజ్-2,ఫేజ్-3 కాలనీలు,అలాగే కలెక్టర్ ఆఫీస్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన ఏసిరెడ్డి నగర్ గుడిసె వాసులు ప్రధానంగా ఈ రహదారిని ఉపయోగిస్తున్నారని,భారీ వాహనాల రాకపోకలతో రహదారి పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు.గత సంవత్సరం రహదారిలో గుంతలో పడిపడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేశారు.మండలంలోని 10 గ్రామాల వందలాది మంది ఈ దారిన రాకపోకలు సాగిస్తున్నారని,ఆసుపత్రులకు వెళ్లడానికీ ఆటోలు రావడం కష్టమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్గత రహదారులు,వీధి దీపాలు,మోరీలు,కుక్కల సమస్య వంటి మౌలిక సదుపాయాలను కూడా తక్షణం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.రహదారి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే,పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన చేపడతామని బూడిద గోపి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజయేందర్,గాజుల నాగరాజు,తాటి వసంత,పాముకుంట్ల రేణుక,శ్రీపతి మమత,నరసయ్య,కాసుల నీల,గుగ్గిళ్ళ పద్మకుమారి,అపర్ణ,కూర లక్ష్మి,శ్రీనివాస్,కొమురయ్య,ఆర్య,ఓధ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.