రైతాంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం.
Hyderabadకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలకు రైతాంగం సన్నద్ధమవ్వాల్సిన అవసరముందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేవల కిషన్ భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో మూడ్ శోభన్ మాట్లాడుతూ దేశంలో నెలకొన్న రైతాంగ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. అందుకు అనుగుణంగానే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే దేశంలోని రైతాంగం ఈ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటం మూలంగా వెనక్కు తగ్గక తప్పలేదని పేర్కొన్నారు. ఈ పోరాటంలో 750 మంది రైతలు అసవులుబాసారని తెలిపారు. ఈ పోరాట సమయంలో ఇచ్చినకనీస మద్దతు ధర గ్యారెంటీని ఇంత వరకు కేంద్రమివ్వలేదన్నారు. అదే విధంగా రైతులను వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు రుణమాఫీ చేయాలని కోరుతున్నామని వివరించారు. అయితే కేంద్రం వద్ద డబ్బుల్లేవని చెబుతుండటం చెప్పడం సరైంది కాదని అన్నారు. కార్పొరేట్ సంస్థకు రూ.11 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన వారికి కోట్లాది మంది రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేయడం పెద్ద సమస్య కాదని అన్నారు. కనీస మద్దతు ధర, రుణమాపీ, సమగ్రమైన పంటలబీమా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరముందన్నారు. అందుకు ఐక్య పోరాటలే మార్గమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహ రెడ్డి,నాయకులు జయరాజు, మహి పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు