తమ్మారెడ్డి భరద్వాజ లాగా పెద్దలు కూడా అండగా నిలవాలి

ఈ69న్యూస్ హైదరాబాద్
తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపు,హామీల అమలు కోసం పదహారు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యను ప్రభుత్వం,నిర్మాతల మండలి కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేయడం తీవ్రంగా ఖండించామని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లైట్ బాయ్స్,డ్రైవర్లు,మేకప్ ఆర్టిస్టులు,టెక్నీషియన్లు,ఫైటర్స్,డ్యాన్సర్స్ వంటి 24 విభాగాల్లో సుమారు 15,000 మంది కార్మికులు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని,కానీ వీరికి సరైన వేతనాలు,భద్రతా సదుపాయాలు లభించడం లేదని అన్నారు.స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రూ.80 నుండి రూ.150 కోట్లు,హీరోయిన్లు రూ.5 నుండి రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్న తరుణంలో కష్టపడే కార్మికుల వేతనాలను పెంచకపోవడం అన్యాయం అని విమర్శించారు.పనిస్థలాల్లో ప్రమాదాలు జరిగినా కార్మికులకు సరైన పరిహారం,వైద్య సదుపాయాలు అందకపోవడం విచారకరమని,బీమా–ఆరోగ్య భద్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం పరిశ్రమకు కళంకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సినీ పరిశ్రమ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ లాగా కార్మికుల పక్షాన నిలవాలని,సమస్యను పరిష్కరించకుండా జటిలం చేయడం సరైంది కాదని,వెంటనే న్యాయమైన కోరికలు నెరవేర్చాలని పినపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు.