జనగామలో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు ఘనారంభం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ 1 నుండి 17 వరకు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఈరోజు ప్రారంభ సూచికగా జిల్లా వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.జనగామ పట్టణంలోని ఏసి రెడ్డి నగర్,డబుల్ బెడ్రూమ్ కాలనీ,ఐదో వార్డు బాణాపురం,గిరినిగడ్డ,సిపిఎం జిల్లా కార్యాలయం,నెహ్రూ పార్క్,ధర్మకంచ,సంజయ్‌నగర్,అంబేద్కర్ నగర్,కలెక్టరేట్ కార్యాలయం తదితర ప్రదేశాల్లో సిపిఎం పతాక ఆవిష్కరణలు జరిగాయి.ఈ కార్యక్రమాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి,పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్,కమిటీ సభ్యులు సుంచు విజయేందర్,ఎండి అజారుద్దీన్,ఇర్రి అహల్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రైతాంగ సాయుధ పోరాట గొప్పతనం జనగామ ప్రాంతానికే దక్కిందని పేర్కొన్నారు.కడవెండి,పాలకుర్తి కేంద్రంగా ప్రారంభమైన ఈ తిరుగుబాటు పోరాటం తెలంగాణ అంతటా వ్యాపించి,సాయుధ పోరాటానికి ఊపిరిలు ఊదిందని గుర్తుచేశారు.ఈ పోరాటంలో నాలుగువేల మంది అమరులయ్యారని,10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచబడ్డదని,బానిస వెట్టి చాకిరి నిర్మూలన జరిగిందని,అంటరానితనాన్ని తొలగించడానికి కృషి జరిగిందని వారు వివరించారు.అంతేకాదు,దేశవ్యాప్తంగా భూసంస్కరణ చట్టాల రూపకల్పనకు ఈ పోరాటమే నాంది పలికారని పేర్కొన్నారు.“ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఈ పోరాటం,మట్టి మనుషులు చేసిన మహత్తర పోరాటం”అని వారు అభిప్రాయపడ్డారు.