ఎల్కతుర్తి లో ఉచిత మెగా వైద్య శిబిరం
రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు.వరంగల్ కాకతీయ వైద్య కళాశాల,హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ,మహిళా సమాఖ్య కార్యాలయాల ప్రాంగణంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు.మెగా వైద్య శిబిరంలో ఓపి నమోదు,హెల్ప్ డెస్క్,ల్యాబ్,ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు.జనరల్ ఫిజీషియన్ విభాగాలతోపాటు ఎముకలు,శస్త్ర చికిత్స,పిల్లలు,చెవి ముక్కు గొంతు,చర్మవ్యాధి,ఛాతీ,కంటి,స్త్రీ వైద్య నిపుణులు వైద్య సేవలను అందిస్తుండగా కలెక్టర్ సందర్శించి ఆయా విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఫార్మసీ కౌంటర్ ను కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ..ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు.కాకతీయ వైద్య కళాశాలకు చెందిన పది విభాగాలు,ఎంజీఎం ఆసుపత్రి నుండి స్పెషలిస్ట్ వైద్యులు ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు.ఎల్కతుర్తి,గోపాలపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఏఎన్ఎంలు,ఆశా లు,మహిళా సమాఖ్య సభ్యులు,గ్రామ కార్యదర్శులు సంబంధిత గ్రామ ప్రజలను గుర్తించి శిబిరానికి పంపించగా వివిధ విభాగాల వైద్యులు పరీక్షించారు. ఈ శిబిరంలో కాకతీయ వైద్య కళాశాల,ఎంజీఎం ఆసుపత్రి నుండి 38 మంది స్పెషలిస్ట్ వైద్యులు,60 మంది పీజీ విద్యార్థులు,ల్యాబ్ టెక్నీషియన్లు,ఫార్మసిస్టులు,పారామెడికల్ సిబ్బంది పాల్గొనగా,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున 35 మంది డాక్టర్లు,సూపర్వైజర్లు,ల్యాబ్ టెక్నీషియన్లు,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తల బృందం పాల్గొన్నారు.అలాగే ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాల పట్ల,ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.ప్రతి ఒక్కరికి బీపీ తో పాటు అవసరమైన వారికి షుగర్,హిమోగ్లోబిన్ పరీక్షలను అక్కడే నిర్వహించగా ఇతర ల్యాబ్ పరీక్షలకు నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ లో పరీక్షల నిమిత్తం పంపించారు.ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని,స్థానికంగా అందుతున్న వైద్యంతో పాటు,స్పెషలిస్ట్ వైద్య సేవలు అవసరం ఉండి పనుల ఒత్తిడి వల్ల అలాగే వైద్య పరీక్షలకుటెస్టులకు అదనంగా డబ్బులు వెచ్చించలేక పట్టణాలకు వెళ్లలేక పోతున్న వారి కోసం మండల కేంద్రంలో వారికి అందుబాటులో వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.93 మందికి ఒక్కరికి దాదాపుగా1800 రూపాయల చొప్పున 1,67,000 వేల విలువైన ల్యాబ్ పరీక్షలు,122 మందికి 16000 విలువైన రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు,2 లక్షల పైగా విలువచేసే మందులను పంపిణీ చేయడం జరిగింది.డి ఎం హెచ్ ఓ విజ్ఞప్తి మేరకు వరంగల్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ వారు దాదాపుగా 15 వేల రూపాయల విలువైన మందులు అందించడం జరిగింది.మొత్తం వైద్య శిబిరంలో( 762)వైద్య సేవలు అందుకోగా అందులో జనరల్ మెడిసిన్(292)ఎముకలవైద్యానికి సంబంధించి (127)శ్వాస సమస్యలు (26)పిల్లలకు సంబంధించిన సమస్యలు ( 20)చర్మవ్యాధి సమస్యలు ( 30)చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలు ( 45)జనరల్ సర్జరీ(25)స్త్రీలకు సంబంధించిన సమస్యలు(27) కంటి సమస్యలకు(170)చికిత్స అందించడం జరిగింది.అలాగే మరింత మెరుగైన పరీక్షలు చికిత్స నిమిత్తం (115 ) మందిని ఎంజీఎం ఆసుపత్రి,జిఎంహెచ్ లకు రిఫర్ చేశారు.ఈ కార్యక్రమంలో కేఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య,ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి,డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య,కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి,స్థానిక తహసీల్దార్ ప్రసాద్ రావు,ఎంపీడీపీ విజయ్ కుమార్,ఏఎంసి ఛైర్మన్ సంతాజీ,సీఐ రమేష్,ఇతర అధికారులు పాల్గొన్నారు.