విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం స్పష్టం
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం కొన్నాయిచలం వద్ద యాంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు జఫర్ గడ్ మరియు స్టేషన్ ఘనపూర్ మండలాల్లోని కస్తూరిభా గాంధీ,ఆదర్శ పాఠశాలలకు సిసి రోడ్డు నిర్మాణ పనులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ,దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా గురుకులాల వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.2011లో కేజీబీవీ స్థాపించినప్పటి నుండి రోడ్ సౌకర్యం లేకపోవడం బాధాకరమని,ఇది గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.విద్యాశాఖ మంత్రిగా ఉన్న కాలంలో కడియం శ్రీహరి గురుకుల పాఠశాలలను ఇంటర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం వల్ల వేలాది మంది విద్యార్థినీలు నాణ్యమైన విద్యను పొందుతున్నారని చెప్పారు.విద్యార్థినిలు సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకుని స్వీయ పోటీ భావనతో ముందుకు సాగాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని,విద్య ద్వారా మాత్రమే పేదరికం నుండి బయటపడవచ్చని ఎంపీ సూచించారు.సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని,ప్రతిభ అభివృద్ధికి ప్లే బ్యాక్ సొసైటీని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థినిలకు సూచించారు.తన ఎంపీ నిధులతో పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలియజేస్తూ.. “మేము సదుపాయాలు ఇస్తాం,మీరు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించండి”అని విద్యార్థినిలను ప్రేరేపించారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..చదువు మాత్రమే జీవితాలను మార్చగల శక్తి కలిగివుందని,విద్యతోనే ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక గౌరవం లభిస్తాయని తెలిపారు.మహిళా సాధికారతకు విద్య,ఉద్యోగం,ఆరోగ్యం అవసరమని అన్నారు.పేదింటి పిల్లలు కూడా ప్రతిభలో ఎవరికీ తీసిపోరని,సరైన శిక్షణ అందిస్తే అద్భుతాలు సాధించగలరని ఉపాధ్యాయులను ప్రోత్సహించారు.రాష్ట్ర వ్యాప్తంగా 1600 గురుకులాల్లో 8 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని,అందులో 5 లక్షల మంది బాలికలేనని పేర్కొన్నారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో కాంప్లెక్స్‌లో 4 గురుకులాలు,సుమారు 200 కోట్ల వ్యయంతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్నట్లు తెలిపారు.విద్యార్థులు జేఈఈ,నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం గురుకులాల నాణ్యతకు నిదర్శనమని అన్నారు.