ముస్లిం కమ్యూనిటీ 130వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక వార్షిక మహా సభలు
భారతదేశ అహ్మదీయ ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో 130వ వార్షిక ఆధ్యాత్మిక అంతర్జాతీయ మహాసభలు (జల్సా సాలానా) సంప్రదాయ వైభవం,ఆధ్యాత్మిక గౌరవంతో పంజాబ్ రాష్ట్రం గురుదాస్ పూర్ జిల్లా ఖాదియాన్ పట్టణ ప్రధాన కేంద్రంలో డిసెంబర్ 26 నుంచి 28-2025 వరకు ఘనంగా నిర్వహించబడుతోంది.1891లో,134 సంవత్సరాల క్రితం,అహ్మదీయ ముస్లిం జమాత్ వ్యవస్థాపకులు హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ (వాగ్దాత్త మసీహ్ మరియు మహ్దీ,అలైహిస్సలాం) అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ఈ జల్సాను ప్రారంభించారు.మతాల మధ్య శాంతి,సౌహార్దం,సామరస్యతను నెలకొల్పడమే ఈ మహాసభ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.ఈ ఆధ్యాత్మిక సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం,ప్రపంచాన్ని నిజమైన సృష్టికర్త వైపు మళ్లించడం,సృష్టి అంతటా పరస్పర ప్రేమ,కరుణ,సోదరభావాన్ని పెంపొందించడం.ఇది సాధారణ సభ కాకుండా,చారిత్రక ప్రాముఖ్యత కలిగిన విశిష్ట ఆధ్యాత్మిక సమావేశంగా నిలుస్తోంది.దేశ విదేశాల నుండి వేలాది మంది భక్తులు ప్రయాణ కష్టాలను సైతం లెక్కచేయకుండా ఈ జల్సాలో పాల్గొంటున్నారు.మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ప్రసంగాలు,ప్రార్థనలు,ఆధ్యాత్మిక చర్చలు పాల్గొనేవారిలో నైతిక,ఆధ్యాత్మిక మార్పును తీసుకొస్తున్నాయి.హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ (అలైహిస్సలాం) ఈ జల్సా ఉద్దేశ్యాన్ని వివరిస్తూ-“ఈ సమావేశం ద్వారా సభ్యుల హృదయాలు పరలోక దిశగా వాలాలి,అల్లాహ్ భయం,ధర్మనిష్ఠ,వినయం,సౌమ్యత,పరస్పర ప్రేమ,సమరసత వంటి గుణాలు వారిలో పెంపొందాలి”అని స్పష్టం చేశారు.‘ప్రేమ అందరికీ-ద్వేషం ఎవరికీ కాదు’అనే మౌలిక సూత్రంతో,ఇతర మతాల భావాలను గౌరవిస్తూ,మానవాళి సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయాలని అహ్మదీయ జమాత్ ఈ జల్సా ద్వారా పిలుపునిస్తోంది.
నేటి ప్రసంగాల సంక్షిప్త వివరాలు:
ప్రసంగం-1ప్రారంభ ఉపన్యాసం
ప్రసంగకర్త:రఫీక్ అహ్మద్ మలబారి సాహెబ్,అధ్యక్షులు-మజ్లిస్ తహ్రీక్-ఎ-జదీద్,అంజుమన్ అహ్మదీయ కాదియన్.ఈ ప్రసంగంలో జల్సా సాలానా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను,ప్రపంచవ్యాప్త విస్తృతిని వివరించారు.జల్సా యొక్క ప్రధాన లక్ష్యం సామాజిక సమావేశం కాదు,ఇస్లాం బోధనలు,ఖురాన్,ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ను అర్థం చేసుకొని,ధర్మనిష్ఠ,ప్రార్థన,ఆత్మసంస్కరణ సాధించడం అని తెలిపారు.చివరగా నిజ ఇస్లాం విజయం సాక్షాత్కరించాలనే ప్రార్థనతో ప్రసంగం ముగించారు.
ప్రసంగం -2:ప్రవక్తల ఆధిపత్యంలో సజీవుడైన అల్లాహ్ సాక్ష్యం
ప్రసంగకర్త:ముహమ్మద్ హమీద్ కౌసర్ సాహెబ్,నజీర్ దావతిల్-అల్లాహ్,కేంద్రీయ కాదియన్.ప్రవక్తల విజయం అల్లాహ్ సజీవత్వానికి నిదర్శనమని,ఇబ్రాహీం,మూసా,ఈసా,ప్రవక్త మహమ్మద్ (స.అ.వ.) జీవితాల ఉదాహరణలతో వివరించారు.ప్రస్తుత యుగంలో ప్రామిస్డ్ మెస్సయ్యా (అలైహిస్సలాం) అవతరణ,అహ్మదీయ జమాత్ ప్రపంచవ్యాప్త పురోగతి అదే దైవ వాగ్దానానికి కొనసాగింపని పేర్కొన్నారు.
ప్రసంగం- 3:ప్రవక్త మహమ్మద్ (స.అ.వ.) జీవితం-మత సహనశీలత,ఆత్మ స్వేచ్ఛ
ప్రసంగకర్త:ముహమ్మద్ ఇనామ్ ఘోరి సాహెబ్,నాజీర్ ఆలా మరియు లోకల్ అమీర్,కాదియన్.ఇస్లాంలో మత బలవంతం లేదని,మత స్వేచ్ఛ,సహజీవనం,మానవ గౌరవానికి ఇస్లాం పెద్దపీట వేస్తుందని ఖురాన్,ప్రవక్త జీవితం ఆధారంగా వివరించారు.నజ్రాన్ క్రైస్తవ ప్రతినిధులతో ప్రవక్త ప్రవర్తన వంటి ఉదాహరణలు పేర్కొన్నారు.ప్రపంచ శాంతికి ఖురాన్ బోధనలే పరిష్కారమని నొక్కి చెప్పారు.
ప్రసంగం-4:ప్రామిస్డ్ మెస్సయ్యా (అలైహిస్సలాం) జీవితం-దైవ ప్రేమ వెలుగులో
ప్రసంగకర్త:హాఫిజ్ మఖ్దూమ్ షరీఫ్ సాహెబ్,అదనపు నాజీర్ ఆలా,దక్షిణ భారతదేశం.దైవ ప్రేమ,అల్లాహ్ సమీపత,నిరంతర దైవ సహాయాన్ని ఈ ప్రసంగంలో వివరించారు.ఖిలాఫత్-ఎ-అహ్మదీయ్యా నాయకత్వంలో అల్లాహ్ సహాయం నేటికీ కొనసాగుతుందని తెలిపారు.ప్రసంగం-5:ప్రామిస్డ్ మెస్సయ్యా స్థానం మరియు హోదా
ప్రసంగకర్త:మునీర్ అహ్మద్ ఖాదిమ్ సాహెబ్,సంపాదకులు-వీక్లీ బదర్,ఖాదియాన్.ఖురాన్,హదీస్ ఆధారాలతో ప్రామిస్డ్ మెస్సయ్యా హోదాను వివరించారు.ఖిలాఫత్ వ్యవస్థ ద్వారా ఇస్లాం సందేశం 220కి పైగా దేశాలకు వ్యాపించిందని తెలిపారు.ప్రపంచ శాంతికి ఖిలాఫత్కు అనుబంధమే మార్గమని స్పష్టం చేశారు.మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ జల్సా సాలానా,ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి,మత సామరస్యానికి ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందిస్తోంది