గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం
గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) అన్నారు.ప్రజలిచ్చిన బాధ్యతను నిజాయితీగా,పారదర్శకంగా నిర్వర్తిస్తూ గ్రామపంచాయతీల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సర్పంచ్‌లు కృషి చేయాలని పిలుపునిచ్చారు.శనివారం భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్‌లో గల పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే జీఎస్సార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.గ్రామ పరిపాలన,అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ఆర్థిక నిర్వహణ, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.ప్రజలతో సమన్వయం కలిగి పనిచేస్తే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కటంగూరి రామ్ నర్సింహారెడ్డి, చల్లూరి మధు, చిట్యాల మరియు భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు గుమ్మడి శ్రీదేవి, గూటోజు కిష్టయ్యతో పాటు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.అనంతరం నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను అతిథులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.సర్పంచ్‌లు తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.