రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్(సురక్షితంగా గమ్యానికి చేరుదాం)రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో భూపాలపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ మాట్లాడుతూ,రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనేనని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్లు మరియు ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.ఇవి చిన్న నియమాలుగా కనిపించినప్పటికీ,ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే అత్యంత కీలక భద్రతా చర్యలని వివరించారు.అధిక వేగంతో వాహనాలు నడపడం,మద్యం సేవించి వాహనం నడపడం,మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని కోరారు.అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్,రోడ్డు సంకేతాలను తప్పనిసరిగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
“సురక్షితంగా గమ్యానికి చేరుదాం” కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి క్షేమంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని పేర్కొంటూ,ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు.అనంతరం పోలీస్ ఉద్యోగులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.