పిడిసిల్లలో కబడ్డీ పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
మొగుళ్ళపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన దివంగత నైనకంటి రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు, గ్రామ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడం, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కబడ్డీ పోటీలను నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పోటీపడ్డారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలు యువతను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, పోరాట స్ఫూర్తి, సహనం, ఐక్యతను నేర్పుతాయన్నారు. గెలుపు–ఓటములు జీవితంలో సహజమేనని, క్రీడల్లో ఎదురయ్యే అనుభవాలు భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.ఇటువంటి క్రీడా పోటీలు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ముందుకు రావాలని సూచించారు.క్రీడల ద్వారా యువత తప్పుదోవ పట్టకుండా మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి, గ్రామ పెద్దలు, క్రీడా నిర్వాహకులు, యువకులు, క్రీడాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.