మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న సిపిఎం
నాలుగు వార్డుల్లో సిపిఎం అభ్యర్థుల పోటీ
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు వార్డుల్లో సిపిఎం పార్టీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు తెలిపారు.స్టేషన్ ఘనపూర్ సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన శాఖ సమావేశం మాజీ వార్డు సభ్యులు చిలుముల్ల భాస్కర్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాపర్తి రాజు మాట్లాడుతూ..స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు.ఇండ్లు,ఇళ్ల స్థలాలు లేని పేదల కోసం నిరంతరం పోరాటం చేశామని అన్నారు.కార్మికుల హక్కుల కోసం మున్సిపల్ కార్మికులు,అంగన్వాడీ,ఆశా కార్యకర్తలు,మధ్యాహ్న భోజన కార్మికులు,హమాలీలు,భవన నిర్మాణ కార్మికులు,ఆటో,ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికుల సమస్యలపై ఉద్యమాలు చేపట్టిన పార్టీ సిపిఎం అని అన్నారు.వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వృత్తిదారుల హక్కుల కోసం పోరాటం చేసిన పార్టీ సిపిఎం అని పేర్కొన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ,విద్యార్థి,యువజన,మహిళ,మైనార్టీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేస్తున్న పార్టీ సిపిఎం అని తెలిపారు.గతంలో చాగల్ గ్రామంలో సర్పంచ్‌గా,స్టేషన్ ఘనపూర్,శివునిపల్లి గ్రామపంచాయతీలలో వార్డు సభ్యులుగా గెలిచి ప్రజలకు సేవలందించిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉందని గుర్తు చేశారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసే వార్డులు,అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్,మండల కమిటీ సభ్యులు సిద్ధుల సుదర్శన్,పట్టణ నాయకులు,మాజీ వార్డు సభ్యులు గుర్రం వెంకటనర్సు,బూశెట్టి రాంబాబు,మునిగెల వెంకన్న,అమరాజు బాబు,దామోదర్ రెడ్డి,ఎం.సతీష్ తదితరులు పాల్గొన్నారు.