కళాశాల ప్రాంగణంలో నేతాజీ విగ్రహానికి ఘన నివాళి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన దేశ్ కి ప్రేమ దివస్ గా చరిత్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రాంగణంలో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య వైస్ ప్రిన్సిపల్ టీ ప్రభాకర్ రావు లు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య మాట్లాడుతూ నేతాజీ జీవిత చరిత్ర, ఆయన చేసిన త్యాగాలు, దేశసేవ, ధైర్య సాహసాలపై విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని,
“యావత్ ప్రపంచ చరిత్రలోనే జన్మదినం జాతీయ ఉత్సవంగా జరుపుకునే ఏకైక మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జీవితం ఒక సాధారణ వ్యక్తి జీవితం కాదు; అది ఒక త్యాగమయ ప్రయాణం, ధైర్యానికి ప్రతీక, దేశభక్తికి చిరునామా” అని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సాధన కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన ధీరుడు నేతాజీ అని ఆయన కొనియాడారు.
వైస్ ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు మాట్లాడుతూ
ఆనాటి బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించిన సందర్భంలో, నేతాజీ మాత్రం సాయుధ పోరాటమే భారతదేశ విముక్తికి మార్గమని నమ్మి ముందుకు సాగారని ఆయన గుర్తుచేశారు. భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి “నాకు రక్తం ఇవ్వండి – మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అనే నినాదంతో కోట్లాది భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపారని అన్నారు. నేతాజీ చేసిన త్యాగం, ధైర్యం, సేవానిరతి వెలకట్టలేనివని ఆయన అభిప్రాయపడ్డారు.
నేతాజీ విద్యార్థి దశ నుంచే అసాధారణ ప్రతిభను కనబరిచారని, ఉన్నత విద్యను పూర్తిచేసుకున్నప్పటికీ, సివిల్ సర్వీసెస్ వంటి ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని తృణీకరించి దేశసేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని ప్రిన్సిపల్ వివరించారు. స్వార్థాన్ని త్యజించి, వ్యక్తిగత సుఖసంతోషాలను పక్కనబెట్టి, భారత మాత సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు నేతాజీ అని కొనియాడారు.
చరిత్ర సహాయ ఆచార్యులు జి శేఖర్ మాట్లాడుతూ
ప్రపంచవ్యాప్తంగా భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించడంలో నేతాజీ పాత్ర అపూర్వమని ఆయన పేర్కొన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు సమీకరించడంలో ఆయన చూపిన దౌత్య నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు నేటి యువతకు ఆదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టీ ప్రభాకర్ రావు, డాక్టర్ బి శ్రీదేవి, డాక్టర్ బి నాగేశ్వరరావు, పి కృష్ణవేణి, డాక్టర్ రాకేష్ శ్రీరామ, డాక్టర్ జి శేఖర్ బి సరిత, టి సురేందర్ బి కరుణాకర్ డాక్టర్ జి రామారావు డి వెంకటేశ్వర్లు , టి శ్రీకాంత్ , పి లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు