మహిళల సంక్షేమం అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
ఇందిరమ్మ చీరల పంపిణీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పీఎం అజయ్ పథకం ప్రారంభం, చేనేత రుణమాఫీ అమలు
•భూపాలపల్లిలో అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మహిళల సంక్షేమం,సాధికారతతో పాటు బహుజన వర్గాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన, రైతుల సాగు సౌకర్యాలు, చేనేత కార్మికుల జీవన భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.శుక్రవారం భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీ, కాశీంపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మహిళలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం కారల్ మార్క్స్ కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు, అలాగే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళల గౌరవం,భద్రత, ఆర్థిక అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. మహిళలకు నాణ్యమైన చీరలను అందించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ఇందిరమ్మ చీరల పథకం ప్రధాన ఉద్దేశమన్నారు.స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేదల అభ్యున్నతికి అమలు చేసిన సంక్షేమ విధానాల స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబాలు బలపడతాయని, తద్వారా రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎం అజయ్) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ రైతుల వ్యవసాయ భూములకు నీటి వనరులు కల్పించేందుకు బోర్‌వెల్‌ను టెంకాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దళిత రైతుల సాగు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో మొత్తం 19 బోర్‌వెల్‌లను ఈ పథకం కింద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.సాగునీటి సౌకర్యాలు మెరుగుపడితే రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.మంజూరునగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణమాఫీ పథకం కింద రూ.59,50,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చేనేత రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని, వేలాది కుటుంబాల జీవనోపాధి ఈ రంగంపై ఆధారపడి ఉందన్నారు. రుణభారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు రుణమాఫీ ఒక పెద్ద ఊరటగా మారిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రకటించిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని, భవిష్యత్తులో కూడా చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.