కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం
ఇది ఒక్క చోట జరిగిన ఘటన కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
•సుభాష్ కాలనీలో శిలాఫలకాల ధ్వంసం ఘటన స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో,మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కృషితో మంజూరు చేసి శంకుస్థాపన చేసిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పనులు పూర్తయిన అనంతరం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాలను ధ్వంసం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.ఈ ఘటనకు నిరసనగా సంఘటన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ…నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసే తెలివి లేదని, ప్రజల కోసం ముందుచూపుతో పని చేసే అవగాహన కూడా లేదని తీవ్రంగా మండిపడ్డారు. అటువంటి ప్రభుత్వమే ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతోందని విమర్శించారు.ఎన్నికల్లో గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం” అంటూ మాట్లాడటం వారి కక్ష్యపూరిత రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.అదే విధంగా భూపాలపల్లిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అదే బాటలో నడుస్తూ, గతంలో జరిగిన అభివృద్ధి పనులను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే ఇద్దరూ గురు–శిష్యుల్లా ఒకే ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని అణిచివేయాలని చూస్తున్నారని గండ్ర జ్యోతి విమర్శించారు.ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి “పేగులు తీస్తాం, తొండలు జోరగొడతాం” అంటూ మాట్లాడటం ఎంత నీచమైన ఆలోచనో ప్రజలే అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించి ముందుచూపుతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాలను తొలగించి, “ఇవన్నీ మేమే చేశాం” అంటూ కొత్త శిలాఫలకాలు ఏర్పాటు చేయడం ఎంత దుర్మార్గమైన చర్యో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఈ చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, ఇంత నీచాతి నీచమైన చర్యలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ,ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా అంబేద్కర్ స్టేడియం ఎదురుగా,సుమారు 15 సంవత్సరాల క్రితం రమణా రెడ్డి తీసుకొచ్చిన జూనియర్ కాలేజీకి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కాలేజ్ గోడకు కొత్తగా శిలాఫలకం వేయడం కూడా అత్యంత హేయమైన చర్యగా గండ్ర జ్యోతి పేర్కొన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు,పోలీసులను అడ్డంపెట్టుకుని రాజ్యమేలుతోందని ఆమె విమర్శించారు.ఇప్పటికైనా అధికారులు గుర్తుంచుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టడం,అభివృద్ధిని చెరిపేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజలు తగిన సమయంలో సరైన బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని గండ్ర జ్యోతి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.