రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఖమ్మం ప్రెస్ క్లబ్ గణతంత్ర దినోత్సవంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుబాటి మాధవరావు అధ్యక్షతన టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఖదీర్, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం తో పాటు రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్యం సందిగ్ధావస్థలో పడ్డాయని ఆవేదన వెలిబుచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సార్వభౌమాధికారం, సామ్యవాద, లౌకికతత్వాలు లోపిస్తున్నాయన్నారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రానికి సార్ధకత చేకూర్చాలనే సంకల్పంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. భావి భారత ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ కోశాధికారిగా ఉపేందర్ ను ప్రకటించారు. గణతంత్ర వేడుకల్లో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నలుబోల మధు శ్రీ, టీబీజేఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం నియోజకవర్గం అధ్యక్షులు తురగ రాజేంద్రమూర్తి, ఖమ్మం ప్రెస్ క్లబ్ కార్యదర్శి నూకల రామచంద్రమూర్తి, టీబీజేఏ కెమెరామెన్ అసోసియేషన్ నాయకులు గణేష్, ఫయాజ్, అర్షద్, నాయకులు గోపీ, కిరణ్, షకీల్, వీసారపు అంజయ్య, కోటి శివారెడ్డి, నాగేశ్వరరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు