
హన్మకొండ, దళితులపై జరుగుతున్న మతోన్మాద దాడులను ఖండించాలని కెవిపిఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేద్కర్ సెంటర్లో ఈ దాడులను ఖండిస్తూ కెవిపిఎస్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలులో భాగంగా బిజెపి ఈ విధంగా దాడులు చేయిస్తుందని ప్రజలను విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపేట్ గ్రామంలో శివ స్వాముల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు దళిత వాడలోకి వెళ్లి మహిళలు అని చూడకుండా వారి పై విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టారు. సోషల్ మీడియాలోని ఒక ప్రచారాన్ని దళితులే చేశారని ఏ ఆధారం లేకున్నా ఆర్ఎస్ఎస్ గుండాలు స్వాముల వేషంలో దళితులపై దాడి చేశారు. ఈ దాడిని కెవిపిఎస్ హన్మకొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు చూస్తూ మిగిలిపోయారని, అలాంటి వారిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో అన్ని ప్రజాసంఘాలను, మేధావులను కలుపుకొని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య. ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్, కనకం కావ్య శ్రీ, అర్షం రామ్ ఖి, రాజు, జడ రమేష్, దుర్గ, అనిత, సంపత్, రాణి, రమ, స్రవంతి, శ్వేత, స్వర్ణలత, ప్రజా సంఘాల నాయకులు యాకన్న, మల్లయ్య, ఎన్నం వెంకటేశ్వర్లు, కంచర్ల కుమారస్వామి, శ్రీకాంత్, జెట్టి లక్ష్మి, సప్పిడి మనోహర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.