
హైదరాబాద్ ఏసి గార్డ్స్ లో మున్సిపల్ అధికారులు పేద ముస్లింలు నివాసముంటున్న 35 ఇళ్ళను అర్థరాత్రి కూల్చేయడం అత్యంత దుర్మార్గమని, ఇళ్ళ కూల్చితతో రోడ్డున పడ్డ 35 కుటుంబాలకి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఏసి గార్డ్స్ లో మున్సిపల్ అధికారుల కూల్చివేతలో ఇళ్ళు కోల్పోయి రోడ్డుపైనే ఉంటున్న కుటుంబాలను ఆవాజ్ ప్రతినిధి బృందం పరామర్శించింది, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ హైదరాబాదులోని ఏసీ గార్డ్స్ లో ప్రభుత్వ స్థలంలో గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న 35 కుటుంబాలకి చెందిన ఇళ్ళను మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో అర్ధరాత్రి కూల్చివేయడం అత్యంత దారుణమని అన్నారు. ఒక వైపు ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న పేదలకు పట్టాలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి ఏఆధారం లేని పేదల ఇళ్లను కూల్చేయడమేంటని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో వాళ్ళు రోడ్లపైనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన, ఇది అత్యంత అమానుష చర్యని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి పునరావాసం చూపించకుండా ఇళ్ళు కూల్చివేసి కుటుంబాలను రోడ్డున పడేసిందని, వయస్సు పైబడిన ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు కూడా రోడ్లమీదనే దయనీయంగా బతుకుతున్నారని అన్నారు. వీరంతా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటే బతికే నిరుపేద కుటుంబాలకి చెందిన వాళ్లని, వేల రూపాయలు వెంటనే చెల్లించి కిరాయి ఇళ్లలో ఉండలేని వారని, ఇండ్లలో నుండి అర్ధరాత్రి పూట గెంటివేసి వాళ్ళ ఇళ్లన్నీ కూల్చేసి వారిని వీధుల పాలు చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, హైదరాబాద్ నగర కార్యదర్శి మహమ్మద్ అలీ, నగర ఉపాధ్యక్షులు యాకూబ్, ఖాజా గరీబ్, యూనుస్, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.