
అంబేద్కర్ ఆశయాలను సమాధి చేస్తున్న ఆరెస్సెస్ - బీజేపీ
హిందూరాష్ట్రం ఏర్పడితే దేశసమైక్యతకు గొడ్డలిపెట్టని అంబేద్కర్ ఆనాడే చెప్పారని కులనిర్మూలన కోసం అంబేద్కర్ పనిచేస్తే అందుకు భిన్నంగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ చాతుర్వర్ణ వ్యవస్థను కోరుతున్నదని అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్- బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు అంబేద్కర్ భావజాలం, ఆచరణకు పెద్ద ఆటంకంగా, సవాల్‌గా మారాయని అంబేద్కర్ విధానాలపట్ల ద్వంద వైఖరి అవలంబించే పార్టీలకు అంబేద్కర్ స్పూర్తితో ప్రజలు బుద్ధిచెప్పాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు.
పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు బోట్ల శ్రీనివాస్ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సభను నిర్వహించగా ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషిచేసిన మహానుభావుడు. స్వతంత్ర భారతదేశపు మొదటి కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాజ్యాంగ శిల్పి. కొలంబియా విశ్వ విద్యా లయం నుండి పీహెచ్డీ, లండన్ విశ్వవిద్యాలయం నుండి డీఎస్సీ డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించిన విజ్ఞాన వేత్త. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్థ్రాల్లో పరిశోధనలు చేసిన మేధావి అని తెలిపారు. ఆయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో జన్మించారు. చిన్నతనం నుంచే కుల అసమానతలను చవిచూశారు. చదువుకోవాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా ఆయనకు కులమే అడ్డుగా నిలబడింది. ఆయన జీవితాంతం ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. తన స్వఅనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమాజంలో వర్ణ, వర్గ బేధాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రజాస్వామ్యం, అంటరానితనం, మత మార్పిడులు, బౌద్ధమతం, హిందూ మతంలోని చిక్కుముడులు, సంస్కరణలు, దళితులు, భారతదేశ చరిత్రలోని వివిధ అంశాలపై కూడా రచనలు చేశారు. కుల వ్యవస్థ రద్దు చేయడానికి కుల నిర్మూలనను ప్రతిపాదించాడు. స్వతంత్ర భారతావనిలో తొలి న్యాయ శాఖామంత్రిగా అంబేద్కర్ పనిచేశారు. కుల వ్యవస్థను సవాల్ చేసిన సామాజిక విప్లవకారుడు అంబేద్కర్. కుల వ్యవస్థ, అంటరానితనం, మానవ, కార్మిక, స్త్రీల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. సమాజాన్ని సమానత్వం, హేతుబద్ధమైన పద్ధతుల్లో పునర్ వ్యవస్థీకరించాలని కోరుకున్నారు. నిచ్చెనమెట్ల సామాజిక నిర్మాణంపై ఆధారపడిన కులాన్ని ఆయన వ్యతిరేకించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధారంగా సమాజాన్ని నిర్మించబడాలని ఆయన దృఢంగా విశ్వసించారు. కానీ నేడు దేశంలో జరుగు తున్నది అంబేద్కర్ ఆలోచనలకు భిన్నం. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటినా, అంబేద్కర్ ఏ వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారో, ఆ వివక్ష నేటికీ కొనసాగుతున్నదని విమర్శించారు. జనాభాలో 70శాతం మందికి పైగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు అనాగరికమైన కుల వివక్షకు, అణిచివేత, లైంగికదాడులకు గురౌతున్నారు.
కుల నిర్మూలన, వివక్షపై పోరాడాలన్న అంబేద్కర్
అణగారిన వర్గాలు-ముఖ్యంగా కార్మికవర్గాలు ఆర్ధిక, సామాజిక దోపిడీకి గురౌతుండటంపై అంబేద్కర్ ఆవేదన చెందారు. ఉత్పత్తి సాధనాలు కొద్ది మంది చేతుల్లో ఉండి దోపిడీ చేయడానికి వీలున్నంత కాలం సామాన్య ప్రజలు అభివృద్ధి చెందడానికి ఏ మాత్రం అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సుంచు విజేందర్, పి ఉపేందర్, పట్టణ నాయకులు బిట్ల గణేష్, బాల్నే వేంకట మల్లయ్య, కళ్యాణం లింగం, చిర్ర రజిత, బాషపాక విష్ణు, శ్రీకాంత్ అజ్మీరా సురేష్, సిఎచ్. ఉపేంద్రర్, పి ఉమా తదితరులు పాల్గొన్నారు.