సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండి. అబ్బాస్
పూర్తైన డబుల్ బెడ్రూం ఇళ్ళను అర్హులైన వారికి ప్రభుత్వం వెంటనే కేటాయించకుంటే మేమే పేదలకు పంపిణీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ గౌస్ నగర్ డివిజన్ కమిటి ఆధ్వర్యంలో ఇళ్ళు లేని పేదల సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ హాజరయ్యారు. ఈ సదస్సుకి సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కిషన్ నాయక్ అధ్యక్షత వహించారు.
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ…గౌస్ నగర్ డివిజన్ పరిధిలో నిర్మించబడి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ళు అర్హులైన పేదలకు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని, అర్హులైన పేదలను సమీకరించి వారికి పంపిణీ చేస్తుందని అన్నారు. స్థానికంగా ఉన్న పేద ప్రజలు బండ్లగూడ తహసిల్దార్, హైదరాబాద్ ఆర్డీవో, హైదరాబాద్ కలెక్టర్ కు దరఖాస్తులు చేసుకుని డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోమని చెప్పగా ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు, రెవిన్యూ అధికారులు సర్వేలు చేసినప్పటికీ ఎవరిని అర్హులుగా గుర్తించలేదు. పేదవాళ్లు డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మాణం పూర్తైన చోట, ఆ ఇండ్లలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు, పందులు నివాసం ఉంటున్నాయి. ఇప్పటికైనా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించడానికి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు మనసు రావడం లేదు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది. నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్ రూం ఇళ్ళ సాధనకోసం పోరాటంలోకి పేద ప్రజలు రావాలని ఈ సదస్సు సందర్భంగా పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎల్.కోటిరెడ్డి, నాయకులు జీవన్, ఫర్హాన తదితరులు పాల్గొన్నారు.