
గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
గత నెల రోజుల కాలం నుండి గ్రామపంచాయతీ కార్మికులు తమ న్యాయం డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిన్నటి రోజున పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయం ముట్టడిలో భాగంగా ముందస్తుగా సిఐటియు జేఏసీ గ్రామపంచాయతీ కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని సిఐటియు జనగామ పట్టణ కన్వీనర్ సుంచు విజేందర్ అన్నారు. శనివారం రోజున సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రు పార్క్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ సుంచు విజేందర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు సంవత్సరాల తరబడి గ్రామాలలో ప్రజలకు అనేక సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనరన్నారు. ప్రభుత్వం తీసుకు వస్తున్న హరితహారం స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేసి గ్రామాలకు అవార్డులు తీసుకువచ్చిన ఘనత గ్రామపంచాయతీ కార్మికులకు దక్కుతుందని వారు అన్నారు. ఇంతటి సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తలదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అన్యబోయిన రాజు జిల్లా కమిటీ సభ్యులు బూడిద ప్రశాంత్ పట్టణ కమిటీ సభ్యులు కచ్చగళ్ల వెంకటేష్ వడ్డేపల్లి బ్లెస్సింగ్ టన్ చీదిరాల ఉపేందర్ గంగర బోయిన మల్లేష్ రాజ్ కంతి అంజయ్య మారేడు వినోద్ కుమార్ చీర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.