
అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ
మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు పల్లె దవఖాన,అంగన్వాడి కేంద్రాలను శనివారం మండల ప్రత్యేక అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారి వి సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో మన ఊరు మనబడి పథకంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.చేసిన పనులకు వెంటనే బిల్లు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు బోధించే ఉపాధ్యాయుల తో కలిసి పాఠశాల సమస్యలు,విద్యా బోధనలపై చర్చించి పలు సూచనలు చేశారు.తరగతి గదిలో ఉన్న విద్యార్థులకు మొక్కలు,పెద్ద చెట్ల పై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.మొక్కలు నాటి వాటిని రక్షించాలని విద్యార్థులను కోరారు. ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని,ఉన్నత విద్యా శిఖరాలను అందుకోవాలని కోరారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఉర్దూ పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు.కేంద్రంలో గల స్టాక్ రిజిస్టర్లు,పిల్లల హాజరు పట్టికలను,స్టోర్ రూమ్ లోగల సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. అంగన్వాడి పిల్లలకు గుడ్లు పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని అంగన్వాడి ఉపాధ్యాయులకు ఆదేశించారు.మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పల్లె దవాఖానను సందర్శించారు.పల్లెదవఖాన కిరాయి ఇంట్లో నిర్వహించడం విడ్డూరంగా ఉందని అసంతృప్తి వ్యక్తపరిచారు. లక్షల రూపాయలతో మండల కేంద్రంలో నిర్మించిన పల్లె దవఖాన వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ఎర్రయ్యను ఆదేశించారు.ఈ నెలాఖరులోగా పల్లె దవఖాన ప్రారంభించే విధంగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తో చర్చించి ప్రారంభిస్తామని హామీఇచ్చారు.పల్లెదవాఖానవైద్యాధికారి హరినాథ్ తో రోగుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని అభివృద్ధి పనులతో పాటు విద్యా వైద్య శాఖల పనితీరును మెరుగుపరిచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తమ శాఖల పరంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.నెలలో రెండు మూడు మార్లు మండలంలో ఆకస్మిక తనిఖీలు చేసి నివేదికను జిల్లా కలెక్టర్కు పంపనున్నట్లు ఆయన తెలిపారు.ఈ తనిఖీలో ఎంపీడీవో ఎర్రయ్య,ఎంపీ ఓ లింగారెడ్డి,హెచ్ఎం బి కనకమ్మ,సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్,ఉపాధ్యక్షురాలు నసీమా, ఏఎన్ఎం మహేశ్వరి,ఆశా కార్యకర్తలు శ్రీలక్ష్మి,సైదమ్మ,లక్ష్మి,సునీత,
గ్రామ కార్యదర్శి రాము,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.