
బోధ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
గ్రామంలో బోధకాలు వ్యాధి నిర్మూలన మాత్రలు అందరూ వేసుకోవాలని గ్రామ సర్పంచి గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ అన్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో బోదకాలు వ్యాధి నిర్మూలన మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెచ్చింది అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. సంవత్సరానికి ఒకసారి ఆల్బెండజోల్, డీఈసీ మాత్రలు వేసుకోవడం ద్వారా వ్యాధి రాకుండా కాపాడవచ్చు అని అన్నారు. శరీరంలో వ్యాధి లక్షణాలు రావడానికి 10 నుంచి 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఒక్కసారి వ్యాధి వస్తే అది మన శరీరం నుంచి వెళ్లడం అసాధ్యమని అన్నారు. శరీరంలో మైక్రో ఫైలేరియా లార్వా నిర్మూలన కొరకు ప్రతి ఒక్కరు ఈ మాత్రలు మింగాలని పిలుపునిచ్చారు. రెండు నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్ర ఒకటి, డీఈసీ మాత్ర ఒకటి, 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారికి ఆల్బెండజోల్ ఒకటి, డిఈసి రెండు, 15 నుంచి ఆపైన వారికి ఆల్బెండజోల్ 1 , డిఇసి మూడు మాత్రలు వేయాలి. భోజనం తర్వాత మాత్రమే ఈ మాత్రలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండు శీను, ఉప సర్పంచ్ నసీమా , స్థానిక వైద్యాధికారి డాక్టర్ హరినాథ్ , కళావతి విజయకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఆరోగ్య కార్యకర్తలు రాధా, మహేశ్వరి ఆశా కార్యకర్తలు సైదమ్మ, లక్ష్మి, సునీత, తదితరులు పాల్గొన్నారు..