మనచే మనకోసం మనం ఏర్పాటు చేసుకున్న సంస్థలు వ్యవస్థలు
Hyderabadమనచే, మనకోసం, మనం ఏర్పాటు చేసుకున్న సంస్థలు, వ్యవస్థలు మనకు వినయ విధేయతలతో ఉండవలసిందే. అలా లేని ఏ సంస్థనైనా, వ్యవస్థ నైనా తప్పనిసరిగా రద్దు చేస్తూ క్రొత్త సంస్థను, వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందే. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు అని “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” చెప్తున్నది. కావున మన కోసం, మన రక్షణ కోసం, మనం ఏర్పాటు చేసుకున్న పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అందరూ ప్రజల కోసం పని చేయవలసిందే. కానీ కొందరు స్వలాభం కోసం, ఇష్టం వచ్చిన రీతిలో చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని, ప్రజలను రక్షించాల్సిన వారు ప్రజాభక్షకులుగా మారటమనేది క్షమించరాని నేరంగానే భావించాలి. మొన్న ఎల్బీనగర్ ప్రాంతంలో గిరిజన మహిళపై పోలీసు వాళ్ళు చేసిన దాడి అత్యంత అమానవీయ సంఘటనగానే చెప్పుకోవాలి. ఇది ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే. ఇలాంటి సంఘటనలు ఏమాత్రం సమాజానికే కాదు, పోలీసు వ్యవస్థకే మంచిది కాదు. మానవ హక్కులను పరిరక్షించే రక్షక భటులు మానవ హక్కుల భక్షకులుగా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవటం అనేది పోలీసు వ్యవస్థనే ప్రశ్నార్థం లోకి నెట్టేసిందని చెప్పుకోవచ్చును. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి, కావున ఇక ఉపేక్షించి లాభము లేదని తేలిపోయింది. ఇలాంటి వారి ప్రవర్తన కారణంగా ఈ సంస్థ స్థానంలో, ఒక క్రొత్త వ్యవస్థ ఆవశ్యకత మరియు అవసరము ఎంతగానో ఉందని “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” గుర్తిస్తున్నది. కావున సమాజంలోని మేధావులు, విశ్లేషకులు, సంఘసంస్కర్తలు, నాయకులు, రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంఘాలు, మీడియా అధిపతులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, శ్రామిక కర్షక సంఘాలు ఇలా ఉన్నవారందరూ ఆలోచించి ఈ వ్యవస్థ స్థానంలో ఒక పటిష్టమైన క్రొత్త వ్యవస్థకు రూపకల్పన చేసేందుకు నిర్ణయం తీసుకుంటే బాగుండునని “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” ప్రజల తరఫున కోరుతున్నది. మనము ఎన్నో సంఘటనలను ఇప్పటికే చూసాము, చూస్తున్నాము. అయినా పోలీస్ సంస్థలలో పని చేసే వారిలో మార్పు రావటం లేదు. కావున ఈ సంస్థ విషయంలో తాత్కాలిక పరిష్కారము కాకుండా శాశ్వత పరిష్కారము తప్పనిసరి. అందుకే అన్ని సంస్థలు, వ్యవస్థలను ప్రక్షాళన చేసి, శిక్షణకు గురిచేసి, క్రొత్త విధివిధానాలతో దృఢమైన సంస్థలను తీసుకువచ్చినప్పుడు ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో గౌరవప్రదమైన జీవనాన్ని గడపగలరని “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” విశ్వసిస్తూ ముగిస్తున్నది.