పెండింగ్ స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ మరియు సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. కెఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ గేట్ ఎదుట భైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) రవీంద్రనాథ్ కు మెమొరాండం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 5177 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలని, ప్రభుత్వ బడులన్నింటినీ మన ఊరు- మనబడి పథకం కింద చేర్చి త్వరితగతిన అభివృద్ధి చేయాలని, కేజీబీవీ లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని,సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలని టెండర్లు వేసి తగు పద్ధతిలో విద్యార్థులకు అవసరమైన నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18,000 ఉపాధ్యాయ పోస్టులను చేయాలని, ఉన్నత విద్యారంగంలో ఖాళీగా ఉన్న 12వేల అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని,పాలక ప్రభుత్వాల నిర్ణయాల వల్లనే నేడు తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలో ఉందని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ,డిఈఓ,డిప్యూటీ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ కార్మికులు నియమించాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాలని, ప్రభుత్వ యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు ఆయా యూనివర్సిటీలకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు నెలవారి ఫెలోషిప్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు భయ్యా అభిమన్యు, అభిమిత్ర, నాగకృష్ణ, కేశ సందీప్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తానం వంశీ, రామ్ చరణ్, పట్టణ నాయకురాలు భవ్య అనిల్, శ్రవణ్, శివమణి తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.