
విధేయుడుగా పనిచేస్తా విజయం సాధిస్తా
నిబద్ధత కలిగిన కార్యకర్తగా, పార్టీ ఇచ్చిన అన్ని బాధ్యతలను చురుగ్గా నిర్వహించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యువ నాయకుడిగా భరత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ తనకు టిక్కెట్ కేటాయించాలని సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడం కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నేడు పాలకుర్తి నియోజకవర్గం నుంచి రావుల భరత్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో దరఖాస్తు ఫారాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. భరత్ రెడ్డి ప్రస్తుతం బిజెపి రాష్ట్ర డేటా సెల్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నుంచే చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ, హుజురాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లోనూ క్రియాశీలకంగా పనిచేసి పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇటు సోషల్ మీడియా విభాగంతో పాటు రాజకీయంగా మంచి గుర్తింపున్న నాయకుడిగా, విద్యావంతుడిగా, అధిష్టానం దృష్టిలోనూ క్లీన్ ఇమేజ్ ఉన్న కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఇంతటి ప్రజల ఆదరణ పొందిన తన సేవలను గుర్తించి బిజెపి పార్టీ టికెట్ కేటాయిస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు.