బిఎస్పి ఎంపీ డానిష్ అలీని దూషించిన బిజెపి ఎంపీ రమేష్ బిధూడే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి
Hyderabad- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్
బిఎస్పీ ఎంపీ డానిష్ అలీని నిండు పార్లమెంటులో “ముల్లా టెర్రరిస్ట్” అంటూ దూషించిన బిజెపి ఎంపీ రమేష్ బిధూడే పార్లమెంటు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, చట్టరీత్యా కఠిన తీసుకోవాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
పార్లమెంటు నూతన భవనంలో జరుగుతున్న ప్రత్యేక సమావేశాలలో బీఎస్పీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు డానిష్ అలీని, సౌత్ డిల్లీకి చెందిన బిజెపి ఎంపీ రమేష్ బిధూడే ముల్లా టెర్రరిస్ట్ అంటూ తులనాడటం అత్యంత దుర్మార్గం, న్యూ పార్లమెంటు, న్యూ ఇండియా అంటూ ఊదరకోడుతున్న బిజెపి నూతన పార్లమెంటులో హేయమైన సాంప్రదాయాలను నెలకొల్పుతున్నది. దేశంలో బిజెపి, సంఘ్ పరివార్ వెదజల్లిన మత విద్వేషం బిజెపి ఎంపీ మాటలలో వ్యక్తం అయింది. మైనారిటీలపై ఎంత ఎక్కువగా విద్వేషం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే బిజెపిలో అంత ప్రాధాన్యత ఉంటుంది అనే వాతావరణం నెలకొంది. దీంతో బిజెపి పార్టీ నాయకులు మైనారిటీలపై విషం కక్కడమే తమ రాజకీయ సోపానానికి మార్గం అనుకుంటున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి స్వయంగా మతవిద్వేషంతో కూడిన వ్యాఖ్యలు చేస్తుంటే అదే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏముంది? రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు దేశ అత్యున్నత చట్టసభల్లో ఇలాంటి మతోన్మాద వ్యాఖ్యలు చేయడం దేశానికి అవమానకరం. దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విద్వేష విషవలయంలోకి పెడుతోంది. మత విద్వేష వ్యాఖ్యలు చేసిన ఎం.పి రమేష్ బిధూడే పార్లమెంటు సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామిక వాదులు ఎంపీ రమేష్ బిధూడే వ్యాఖ్యలను ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.