
దేవాలయాలు మన జిల్లాలో ఎన్నో ఉన్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం భద్రాచలం దేవస్థానం వద్ద పర్యాటకశాఖ, డిఆర్డీఓ, గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో శ్రమదానం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మానవహారం, దేవస్థానం నుండి జూనియర్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విహారయాత్రలు మానసిక ప్రేరణను పెంచుతాయని చెప్పారు. విహారయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు మానసిక ప్రేరణ పెంచడంతో పాటు చరిత్రపై అవగాహన కలుగుతుందని అన్నారు.
జిల్లాలో అధ్భుతమైన చారిత్రక సంపద వుందని అన్నారు. ప్రతీ ఒక్కరూ మన చరిత్ర, సంస్కృతినీ తెలుసుకోవాలన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కొరకు ర్యాలీ లు చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. తీరిక సమయాల్లో కుటుంబ సమేతంగా పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందిని అన్నారు. మన జిల్లాలో భద్రాచలం దేవస్థానం, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్టు, జింకల పార్కు, పెద్దమ్మతల్లి దేవాలయం, నవభారత్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం, అన్నపురెడ్డిపల్లిలో బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అక్కడే శివాలయం, అశ్వారావుపేటలో గుబ్బల మంగమ్మ గుడి వంటి ఎన్నో దర్శనీయ స్థలాలున్నట్లు చెప్పారు.
జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము ఒక్కొక్క సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సంవత్సరం “టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్” అనే అంశంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతి అధికారి రమాకాంత్, సహకార అధికారి వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, పంచాయతి కార్యదర్శి వెంకటేశ్వర్లు, వివిధ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.