
కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.
ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.
మణుగూరు 100 పడకల హాస్పిటల్ కాంట్రాక్టర్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించి, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కాంట్రాక్టు కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ సూపర్నెండెంట్ కు కాంట్రాక్టు కార్మికుల తో ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద పడకల హాస్పిటల్లో సూపర్వైజర్లు,సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్లు, పేషెంట్ కేర్ తదితర విభాగాల్లో 44 మంది కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారని, వీరికి 2022 ఫిబ్రవరి నుండి నవంబర్ వరకు 10 నెలల వేతనాలు చెల్లించలేదని అన్నారు. పాత కాంట్రాక్టర్ మారి కొత్త కాంట్రాక్టర్ వచ్చాడని అన్నారు. పాత 10 నెలల వేతనాల కోసం హాస్పటల్ సూపర్నెండెంట్ కు, సంబంధిత ఉన్నతాధికారులకు, కలెక్టర్ గారికి అనేకసార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు పెండింగ్ వేతనాలను ఇప్పించలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని సదరు కాంట్రాక్టర్ దగ్గర నుండి 10 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ వేతనాల చెల్లింపుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే లేబర్ అధికారులను ఆశ్రయిస్తామన్నారు. కొత్త కాంట్రాక్టర్ కూడా జూన్ నెల నుండి ఇప్పటి వరకు నాలుగు నెలల వేతనాలు చెల్లించలేదన్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్పిటల్ లలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించకుండా వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని, వారు రోగులకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే చెల్లించి, ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించకపోతే కాంట్రాక్ట్ కార్మికులతో ఆందోళన నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు 100 పడకల హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్లు పాల్గొన్నారు.