
సూర్యాపేట పోలీసులు మంత్రి చేతిలో కీలబొమ్మలు
వట్టే జానయ్య హత్యకు మంత్రి జగదీష్ రెడ్డి కుట్ర
సూర్యాపేటలో బీఎస్పీ కార్యాలయం ప్రారంభం
రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే మంత్రి జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ (డీసీఎంఎస్), బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.గురువారం సూర్యాపేటలో బీఎస్పీ ఇంఛార్జి వట్టే రేణుక అధ్వర్యంలో నిర్వహించిన భారీ ఎన్నికల సన్నాహక ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ అరాచక సాగిస్తున్నారని అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్ పై నిరాధారంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో ఏకకాలంలో కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలనే కుట్రతోనే మంత్రి తన అనుచరులను ఉసుగోల్పుతున్నారని అన్నారు. వట్టే జానయ్య యాదవ్ పై పోలీసులు అక్రమ కేసులను బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. జానయ్య,కుటుంబ సభ్యులకు మంత్రి జగదీష్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందన్నారు.రాష్ట్రంలో రెడ్డి,వెలమ కులాలకు చెందిన నాయకులే ఆధిపత్యం చెలాయిస్తున్నారని,వచ్చే ఎన్నికల్లో వీరిని ఓడించాలని కోరారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ నాయకులు ఎప్పటికీ రెడ్డిల చెప్పు చేతుల్లోనే ఉండాలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పోలీస్ అధికారులు మంత్రి చేతుల్లో కీలు బొమ్మలుగా మరారని విమర్శించారు.జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమని ప్రకటించారు.త్వరలోనే బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామన్నారు.రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలనలో బీసీ నాయకులపై దాడులు పెరిగాయన్నారు.రాబోయే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు.సూర్యాపేట మెడికల్ కాలేజీ నుంచి డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకూ బీఎస్పీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యానగర్ లో పార్టీ నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ర్యాలీలో జిల్లా అధ్యక్షులు బుడిగే మల్లేష్ యాదవ్, పార్టీ నాయకులు దాసరి శ్రీనివాస్, నకిరేకంటి వెంకన్న, దశరథ, సరిత తదితరులు పాల్గొన్నారు