
linen 21 jan
సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి కేవలం 54 సంవత్సరాల తన జీవితకాలంలో లెనిన్ ప్రపంచకార్మిక విప్లవ ప్రగతిపైన చెరగని ముద్రను వేశా డు. మార్క్సిజం అనే సృజనాత్మక శాస్త్ర సారాన్ని సమగ్రంగా అవగాహన చేసుకుని, దాన్ని సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది రష్యన్ విప్లవాన్ని విజయ పథంవైపు నడిపించాడు. అలా ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు దేశంగా సోవియట్ యూనియన్ ఆవిర్భవించింది. మార్క్సిజంపైన జరుగుతున్న అన్నిరకాల వక్రీకరణలకు వ్యతిరేకంగా పోరాడుతూ, విప్లవోద్యమాన్ని పట్టాలు తప్పకుండా కాపాడి మార్క్సిజాన్ని సుసంపన్నం చేశాడు. విప్లవోద్యమ గమనంలో సంభవించే రకరకాల మలుపుల్లో సరియైన ఎత్తుగడలను అనుసరించటంలో తనకుతానే సాటి అని అనిపించుకున్నాడు. ఆయన ఒక మార్క్సిస్టు సిద్ధాంతకర్త, వ్యూహకర్త, గొప్ప ఎత్తుగడల రూప కర్త (ట్యాక్టీషియన్).ప్రపంచ వ్యాప్తంగాను, ప్రపంచంలోని ప్రతిదేశంలోను విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఆయన రచనలను నిరంతరం అధ్యయనం చేయటం అవసరం. మార్క్సిజం సారంపైన పట్టును సాధించటం మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంపైన, దాని సృజన శీలత, శాస్త్రీయతలపైన సమగ్రమైన అవగాహన ఏర్పరచుకుని లెనిన్ ప్రపంచ విప్లవోద్యమాన్ని నడిపించ గలిగాడు. మార్క్సిజమనే అపూర్వ భాండాగారానికి ఆయన చేసిన అసమాన సేవలు, పథనిర్దేశన గురించి లోతుగా అర్థం చేసుకోవటానికి విడివిడిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ”రాజ్యం-విప్లవం”, ”సోషల్ డెమోక్రసీకి చెందిన రెండు ఎత్తుగడలు”, ”ఏమి చెయ్యాలి”, ”సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ” వంటి లెనిన్ ప్రముఖ రచనలను చాలామంది అధ్యయనం చేశారు. నిజానికి ఇలా చేయటం చాలా ముఖ్యం. వర్తమాన పరిస్థితులలో మానవాళి విముక్తి కోసం జరిగే పోరాటాలను ముందుకు తీసుకుపోవటానికి ప్రతి విప్లవకారుడు లెనిన్ రచనల సారాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అయితే ప్రపంచ కార్మికోద్యమం, రష్యన్ విప్లవపథంలో సంభవించిన వివిధ మలుపుల్లో లెనిన్ ఈ రచనలను ఎందుకు చేయవలసి వచ్చిందనే విషయంపైన అవగాహన ఏర్పరచుకోవటం కూడా అంతే ముఖ్యం. లెనిన్ మార్క్సిజాన్ని ఎంత గొప్పగా అంతర్లీనం చేసు కున్నాడో తెలియాలంటే ఆయన చేసిన రెండు సూత్రీ కరణలను ఒక చోటకు చేరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మొదటగా ఆయన ”ప్రజలకు స్నేహితులు ఎవరు…?” అని అడిగాడు. ”లక్షలాది శ్రమజీవులు మార్క్సిజంవైపు ఆకర్షింపబడటానికి కారణం మార్క్సిజం ఏక కాలంలో విప్లవకర, అత్యంత శాస్త్రీయ పార్శాలు కలిగిన ఏకైక తత్వశాస్త్రం కావటమే. మార్క్స్, ఎంగెల్స్ తమ జీవిత కాలంలో ఈ రెండింటినీ కలపటం వల్లనే ఇవి కలిసిలేవు. మార్క్సిజం ఈ రెండింటినీ తనలో విడదీయరాని బంధంలో ఉంచుతుంది. రెండవది,నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించటం మార్క్సిజానికి అత్యంత కీలకమైనది. అది మార్క్సిజానికి సజీవ ఆత్మ. మార్క్సిజంలోని విప్లవకర, అత్యంత శాస్త్రీయ పార్శాలను కలిపివుంచటం ద్వారానే విప్లవలక్ష్యమైన మానవాళి విమోచన నెరవేరటం సాధ్యం. ఒక పార్శానికి ఎక్కువ, మరొక పార్శానికి తక్కువ ప్రాధాన్యతనిస్తే అది వక్రీకరణలకు దారితీస్తుంది. విప్లవ సాధ్యతను విస్మరించి పరిస్థితిని కేవలం శాస్త్రీయంగా విశ్లేషించటంపైనే దృష్టిని కేంద్రీకరిస్తే అది సంస్కరణవాద వక్రీకరణకు దారితీస్తుంది. అలాగే పరిస్థితిని శాస్త్రీయంగా విశ్లేషించటాన్ని విస్మరించి విప్లవ నినాదాలను ఇవ్వటానికి పాల్పడితే అది వామపక్ష దుందుడుకువాద వక్రీకరణకు దారితీస్తుంది. అటువంటి వక్రీకరణలు జరగకుండా చూడాలంటే మార్క్సిజంలోని ఈ రెండు పార్శాలను సరియైన రీతిలో కలిపి ఉంచటం అవసరం. ‘నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించటం’ అంటే నిర్దిష్ట పరిస్థితులను వస్తుగతంగా అంచనావేసి దాని ఆధారంగా సరియైన విప్లవ విశ్లేషణ చేయటం. ఆత్మగత కారణాలతో నిర్దిష్ట పరిస్థితులను తప్పుగా అంచనావేస్తే అది లోపభూయిష్టమైన, తప్పుడు రాజకీయ విశ్లేషణకు దారి తీసి విప్లవోద్యమాన్ని వక్రమార్గం పట్టిస్తుంది. కాబట్టి మార్క్సిజంలోని రెండు పార్శాలను కలిపివుంచి నిర్దిష్ట పరిస్థితులను విప్లవకారుడు సమర్థవంతంగా వస్తుగతంగా చేసే విశ్లేషణ ఆధారంగానే విప్లవోద్యమం ముందుకు సాగగలుగుతుంది. ఒకవేళ సమగ్ర విశ్లేషణ ఆధారంగా చేసిన అంచనాతో విప్లవోద్యమం సరియైన రాజకీయ-ఎత్తుగడల పంథాను రూపొందించి, అనుసరించినా దాని ఫలితం పార్టీ బలంపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పంథా నూటికి నూరుశాతం సరియైనదైనప్పటికీ దాన్ని ప్రజల వద్దకు తీసుకు పోగలిగే పార్టీ లేనప్పుడు దాని ప్రభావం అంతగా ఉండదని స్టాలిన్ లెనినిస్టు అవగాహనతో చెప్పాడు. ఆవిధంగా విప్లవోద్యమం పురోగమించటానికి పార్టీ ఆర్గనై జేషన్, దాని శక్తిసామర్థ్యాలు… వీటినే లెనిన్ ‘ఆత్మగత కారకం (సబ్జెక్టివ్) అని అన్నాడు- వీటన్నింటిలో సంస్కరణ, వామపక్ష దుందుడుకు వాద లక్షణాలకు సంబంధించిన అన్ని రకాల వక్రీకరణలపైన లెనిన్ అలుపెరుగని పోరాటం చేశాడు. విప్లవప్రగతి కీలక తరుణాలలో వక్రమార్గం పట్టకుండా చూడటానికి వీటికి చెందిన ప్రతి వక్రీకరణను ఎండగట్టి, కార్మికోద్యమ స్పష్టత కోసం లేనిన్ అనేక గొప్ప రచనలను చేశాడు. విప్లవోద్యమానికి సరియైన దిశానిర్దేశంచే యటానికి, అంతిమంగా విజయం సాధించటానికి, భావ జాలపరంగా కార్మికోద్యమంలో పేరొందిన అనేకమంది నాయకులతో ఆయన పోరాటం చేయవలసి వచ్చింది. మార్క్సిజాన్ని తాజాపర్చటం రష్యన్ విప్లవాన్ని విజయవంతం చేయటం దేశంలోని పరిస్థితులు,వాటి వైరుధ్యాల విశ్లేషణతోపాటు ప్రపంచ పరిస్థితులను, వాటి వైరుధ్యాలను సరియైన రీతిలో విశ్లేషించకుండా రష్యా విప్లవంతో సహా ఏ విప్లవము విజయవంతం కాజాలదనే విషయాన్ని మార్క్స్ ని, మార్క్సిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న తరువాత లెనిన్ గ్రహించాడు. ప్రపంచస్థాయి పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థపైన, దానిలోని ధోరణులపైన మార్క్స్ చేసిన సునిశిత విశ్లేషణ ఆధారంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి కొనసాగుతుండగా దానిలో కేంద్రీకరణ, సాంద్రీకరణ ధోరణి నూతన స్థాయికి చేరుకుని గుణాత్మక మార్పుకు లోనైందని లెనిన్ విశ్లేషించాడు. మార్క్స్ తన జీవిత చరమాంకంలో గుత్త పెట్టుబడిదారీ ధోరణులను గమనించాడు. మార్క్స్ మరణానంతరం ఎంగెల్స్ దీన్ని పెట్టుబడి గంథం మూడవ సంపుటిలో పొందుపరిచాడు. గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధితో పెట్టుబడి పాలన యావత్ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకుందని, అది సామ్రాజ్యవాద దశ అని, ఇదే పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ అని 20వ శతాబ్దం ప్రారంభంలో లెనిన్ సూత్రీకరిం చాడు. సామ్రాజ్యవాదంతో ఆవిర్బవించిన వైరుధ్యాలను సరియైన రీతిలో అంచనావేసి,విశ్లేషించి సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచాన్ని గొలుసులతో బంధించిందని లెనిన్ చెప్పాడు. సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకుని ఈ సామ్రాజ్య వాద గొలుసులో అత్యంత బలహీనంగా వున్న లింక్‌ని తెగ్గొట్టాలి. ఆనాటి మానవ చరిత్రలో రష్యా అటువంటి బలహీనమైన లింక్‌గా ఉంది. సామ్రాజ్యవాద దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని (కొనసాగుతున్న మొదటి ప్రపంచ యుద్ధాన్ని) అంతర్యుద్ధంగా మార్చాలని, శాంతి, తిండి, భూ మి నినాదాన్ని రష్యన్ ప్రజల ముందుంచాలని లెనిన్ పిలుపునిచ్చాడు. అటువంటి నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా చేసిన విశ్లేషణ ఆధారంగా రష్యాలో విప్లవోద్యమానికి ఆయన నాయకత్వం వహించి అంతిమంగా 1917 అక్టోబర్ లో విప్లవాన్ని విజయ పథంవైపు నడిపాడు. సామ్రాజ్యవాదం పైన లెనినిస్టు అవగాహన, విశ్లేషణ, సామ్రాజ్యవాద దేశాల మధ్య ఆవిర్బవించిన వైరుధ్యాలు రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. దీనిలో జర్మనీ పాత్రతో ఒక నూతన ప్రపంచక్రమం ఏర్పడటానికి దారి తీసింది. సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకోవటం వల్ల ఫాసిజం ఓటమిపాలైంది. అది తూర్పు ఐరోపా ఖండం విమోచనకు దారితీసింది. తత్ఫలితంగా సోషలిజానికి అనుకూలంగా వర్గ పొందికలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మార్పునకు ప్రతిస్పందనగా సంక్షేమ రాజ్య భావన అనే ఒక గుణాత్మకమైన నూతన దశలోకి పెట్టుబడిదారీ దేశాలు ప్రవేశించాయి. నేడు మనం మన పార్టీని మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీగా పిలుచుకుంటున్నామంటే మనం ఉద్దేశ పూర్వ కంగా లెనిన్ మార్క్సిజాన్ని అన్నివిధాలుగా సంపద్వంతం చేసిన విషయాన్ని, అన్ని రకాల వక్రీకరణలకు (ముఖ్యంగా సంస్కరణవాద, వామపక్ష దుందుడుకు వాద వక్రీకరణలకు) వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని, కార్మిక, కర్షక మైత్రి అక్షం చుట్టు దోపిడీకి గురౌతున్న వర్గాలను సమీకరించే ఎత్తుగడలను రూపొందించిన విషయాన్ని, మానవాళి విమోచనకు చరిత్ర గమనాన్ని ప్రభావితం చేయగలిగే, విప్లవోద్యమాన్ని ప్రగతిపథంలో సాగేలా చేసే ఎత్తుగడలను రూపొందించే కార్మికవర్గ పార్టీని నిర్మించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా మని అర్థం. లెనినిజం అంటే ”సామ్రాజ్యవాద శకంలో మార్క్సిజం” అని స్టాలిన్ నిర్వచించాడు. ప్రపంచ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ప్రపంచ కార్మిక విప్లవానికి లెనిన్ నాయకుడు. రష్యాలో సోషలిజం విజయవంతం కావటం, సోవియట్ యూనియన్ ఏర్పడటం, ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న విప్లవ పోరాటాలు ముందుకు సాగటానికి ప్రేరకంగా ఉంటాయని ఆయనకు తెలు సు. ఈ అవగాహనతోనే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలు తమతమ దేశాలలో జరుగుతున్న ప్రజాపోరాటాలను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పోరాటాలతో అనుసంధానం చేశాయి. ”జాతీయ, వలస సమస్య”పైన లెనిన్ ప్రతిపాదనలు (థీసెస్) అన్ని వలసదేశాలలో కొనసాగుతున్న జాతీయ విమోచన పోరాటాలను సామ్రాజ్యవాదానికి వ్యతి రేకంగా ప్రపంచస్థాయిలో జరుగుతున్న పోరాటాలతో అనుసంధానం చేయటానికి కావలసిన పునాదిని వేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ థీసిస్ జాతీయ, వలస వ్యతి రేక పోరాటాలపైన బలమైన ప్రభావాన్ని చూపింది. దీని ప్రభావంతో చరిత్రగతినే మార్చేంతగా విప్లవోద్యమం పురోగమించింది.ఆ కాలంలో వియత్నాంలో ఫ్రెంచ్ వలస పాలకులు పాల్పడుతున్న నేరాలపైన ఫ్రాన్స్‌లో నివసిస్తున్న హోచిమిన్ కరపత్రాలను పంచి పెడుతుండేవాడు. లెనిన్ తమను ఎంతగా ప్రభావితం చేశాడో ఆయన మాట ల్లోనే…”అప్పట్లో నేను అక్టోబర్ విప్లవ చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోక ముందే స్వభావరీత్యా దానికి మద్దతు పలికాను. తన దేశ ప్రజలను విముక్తి చేసిన గొప్ప దేశ భక్తుడైన లెనిన్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటివరకు నేను ఆయన రచనలను ఏవీ చదవలేదు. ఆ తరువాత హుమనైట్లో ప్రచురింపబడిన లెనిన్ ‘థీసిస్ ఆన్ దనేష నల్ అండ్ కలోనియల్ క్వచ్చన్స్’ను చదవమని ఒక కామ్రేడ్ ఇచ్చాడు. ఆ థీసిస్లోని రాజకీయ పరిభాషను అర్థం చేసుకోవటం కష్టమనిపించింది. అయితే పదేపదే చదవటంవల్ల అంతిమంగా దాని ప్రధాన భాగాన్ని అర్థం చేసుకో గలిగాను. అది నాలో ఎంతో ఉద్విగతను, ఉత్సాహాన్ని, స్పష్టతను, ఆత్మస్థైర్యాన్ని నింపింది! ఆ సంతోషంలో నా కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. నా గదిలో ఒక్కడినే ఏకాంతంగా కూర్చున్నప్పటికీ ఒక మహాసభలో ప్రసంగిస్తున్నట్టుగా పెద్దగా అరుస్తూ ఇలా మాట్లాడాను. ‘ప్రియమైన యోధులారా, నా దేశ వాసులారా! మనకు కావలసింది ఇదే. మన విమోచనకు ఇదే మార్గం! తూర్పు దేశాలకు చెందిన శ్రామికుల కోసం లెనిన్ ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన విప్లవకారులు సిద్ధాంతం, ఆచరణలపైన సమగ్రమైన అవగాహనతో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటానికి తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. ఆవిధంగా కార్మిక వర్గ ఉద్యమానికి, కమ్యూనిస్టు అంతర్జాతీయతకు అంతర్జాతీయ సంఘీభావాన్ని అందించటానికి లెనిన్ మార్గదర్శక పాత్రను పోషించాడు… ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి, మీకు పోయేదేమీ లేదు సంకెళ్లుతప్ప’. కర్తృత్వ కారకం (సబ్జెక్టివ్) పెట్టుబడిదారీ వ్యవస్థ స్వతస్సిద్ధంగా పతనం కానే కాదు. దాన్ని కూలదోయవలసిన అవసరం ఉంది. పెట్టుబడి పాలనపైన రాజకీయ దాడిని వాడిగా చేయటానికి ప్రజా పోరాటాలను నిర్వహించటం ద్వారా వర్గ పోరాటాలను తీవ్రతరం చేసే కార్మికవర్గ నేతృత్వంలో సమాజంలోని భౌతికశక్తిని బలోపేతం చేయటంపైన పెట్టు బడిదారీ వ్యవస్థను కూలదోయట మనే విప్లవ కార్యాచరణ నిర్ణయాత్మకంగా ఆధారపడి ఉంటుంది. ఇటువంటి భౌతిక శక్తిని నిర్మించటం, ‘కర్తృత్వ కారకం’గా వుండే దీని బలాన్ని అనివార్యంగా బలోపేతం చేయవలసి ఉంటుంది. సంక్షోభానికి చెందిన నిర్ధిష్ట పరిస్థితులు ‘వస్తుగత కారకం’ (ఆబ్జెక్టివ్)గా ఉంటాయి. ‘వస్తుగత కారకం’గా వుండే నిర్దిష్ట పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ‘కర్తృత్వ కారకం’గా వుండే శక్తులను బలోపేతం చేయకుండా పెట్టుబడి పాలనను తుద ముట్టించటం సాధ్యపడదు. వర్గపోరాటానికి పదును పెట్టటానికి, ‘కర్తృత్వ కారకం’ను బలోపేతం చేసేందు కోసం, వాస్తవ పరిస్థితులనుంచి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవటం కోసం కార్మికవర్గం అనేక మధ్యస్థ నినాదాలను, చర్యలను,ఎత్తుగడలను ఉపయోగించ వలసి ఉంటుంది. ఆవిధంగా తమతమ దేశాలలో విప్లవ పరివర్తనను వేగవంతం చేయటం జరుగుతుంది. విప్లవ ఎత్తుగడలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవటానికి తగిన ఎత్తుగడలు అవసరం అవుతాయి. ఇప్పుడు కూడా లెనిన్ కార్యాచరణ, బోధనలు మార్గనిర్దేశం చేస్తాయి. లెనిన్ శత జయంతి సందర్భంగా స్వర్గీయ మాకినేని బసవ పున్నయ్య పీపుల్స్ డెమోక్రసీలో ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసానికి ఆయన పెట్టిన శీర్షిక పేరు ‘రాజ్యాధికారం కోసం, దాన్ని స్థిరీకరించటం కోసం చేసే పోరాటంలో కార్మికవర్గ ఎత్తుగడల ప్రవీణుడు’. చాలామంది చాలా తరచుగా లెనిన్ ఎత్తుగడల ప్రావీణ్యతను, రష్యన్ విప్లవం అంతిమంగా విజయం సాధించేవరకు ప్రతి మలుపులో ఆయన వేసిన ఎత్తుగడలు పోషించిన పాత్రను పట్టించుకోరు. ప్రపంచస్థాయిలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపేందుకు అనుసరించ వలసిన ఎత్తుగడల గురించి ఆయన దిశా నిర్దేశం చేశాడు. స్టాలిన్ తన ”లెనినిజం పునాదులు” గ్రంథంలో లెనిన్ ఎత్తుగడల నియమాలు మూడు విషయాల మీద ఆధార పడి ఉంటాయని రాశాడు. వాటిని ఆయన ఇలా సంక్షిప్తీకరించాడు: (1) జాతీయ ప్రత్యేక లక్షణాలు, స్వభావాలు, (2) విప్లవ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటానికి కార్మిక వర్గానికి మిత్ర పక్షాలను కలిపేందుకుగల అవకాశం ఎంత చిన్నదైనా వదులుకోరాదు. ఈ ప్రయత్నంలో సదరు పక్షాలు తాత్కాలికంగానే కలుస్తాయా, నిలకడ లేకుండా ఉ న్నాయా, నమ్మదగినవి కావా అనే విషయాలను పట్టించు కోనవసరం లేదు, (3) ప్రజా సమూహాలకు ఆచరణాత్మక మైన రాజకీయ అనుభవం రావటానికి కావలసిన రాజకీ యశిక్షణకు ప్రచారం, ఉద్యమించటం మాత్రమే సరిపోవు. వర్తమాన పరిస్థితి భారతదేశంలో ప్రస్తుతమున్న పరిస్థితిలో ఈ దిశలో ముందుకు పోవాలంటే బీజేపీని ఒంటరిని చేసి ఓడిం చటం తక్షణ కర్తవ్యంగా ఉండాలి.భారత రాజ్యాంగాన్ని నాశనం చేయటానికి, లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా ఒక తీవ్ర అసహన,పాసిస్టు ”హిందూత్వ రాజ్యం”గా పరివర్తించటానికి ఉపయోగిస్తున్న రాజ్యాధికారంపైన బీజేపీకి నియంత్రణ లేకుండా చేయాలి. దీన్ని సాధించాలంటే లెనినిస్టు విప్లవ ఎత్తుగడల నియమాల ఆధారంగా సరియైన ఎత్తుగడలను అనుసరించి తీరాలి. లెనినిజం వర్ధిల్లాలి! (జనవరి 21 లెనిన్ శత వర్థంతి)