మునగాల:రేపాల కేంద్రంగా నాన్ కెనాల్ కింద ఉన్న 11 గ్రామ పంచాయతీలను కలుపుతూ ప్రత్యేక నూతన రూరల్ మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి రేపాల మండల సాధన సమితి అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలోని సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను మండల సాధన సమితి నాయకులు కలిసి ప్రత్యేక మండల అవశ్యకతను వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి,ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం మండల సాధన సమితి నాయకులు మాట్లడుతూ రేపాల ప్రత్యేక మండలం కోరడానికి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పక్కనుండే వెళుతున్నా దశాబ్దాల తరబడి నీటి సౌకర్యం లేక ఈ 11 గ్రామాల ప్రజల భూములు బీడు భూములుగా మారాయని,త్రాగునీరు లేక ప్రజల గొంతులు ఎండుతున్నాయని వాపోయారు.ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేపాల,విజయరాఘవాపురం, తాడ్వాయి,మాధవరం, సీతానగరం తదితర గ్రామాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.