
telugu galam news e69news local news daily news today news
ప్రచార వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కార్మిక, కర్షక నేతలు…
మోడీ విధానాలు దేశ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు
కార్మిక, కర్షక నేతలు
మోడీ విధానాలు దేశ ప్రయోజనాలకు గుడ్డలు పెట్టు వంటివి అని ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని, ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకులు యలమంచి రవికుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి లు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టి నరేంద్ర మోడీ ప్రధాని అయిన గత పది సంవత్సరాల కాలంలో కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు, రైతులకు చేసింది ఏమీ లేదని కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూరే విధంగా విధానాలు అమలు చేశారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు కోడ్ లను తీసుకువచ్చిందని విమర్శించారు. గ్రామీణ ఉపాధి చట్టానికి నిధులు కోత విధించి వ్యవసాయ కార్మికుల నడ్డి విరిచిందని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చిన మోడీ నేటికీ మద్దతు ధర చట్టాన్ని తేలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రోజు రోజుకు పేదరికం, నిరుద్యోగం, ప్రజల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయని అన్నారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ లో కార్మికులు రైతులు కూలీలు సమస్త ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గడ్డం స్వామి, సి . ఐ.టీ.యూ నాయకులు అజయ్ కుమార్, రాయల రాములు, విద్యార్థి సంఘం నాయకులు ఎస్ భూపేంద్ర, గిరిజన సంఘం నాయకులు కే రవి, యన్ . శంకర్ తదితరులు పాల్గొన్నారు..