
మూవీ డెస్క్,30 మే: తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, అభినయం, అలరించే నటనతో తన పేరులో శాంతిని సార్ధకం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయి కథానాయకగా రాణించడం అసాధ్యం అన్న పదాన్ని సుసాధ్యం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది నటి శాంతి ప్రియ. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఆమె చేస్తున్న కృషి పై ప్రత్యేక కథనం..
సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో తన నటనతో అలరించడం, విజ్ఞతతో మెదులుకోవడంతో సినిమా అవకాశాలు ఆమె చెంత చేరుతున్నాయి. అటు నటనలో ప్రతిభ కనబరుస్తూ.. ఇటు అభిమానులకు నిరంతరం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ అభిమానుల నుండి మన్ననలు పొందుతుంది. చదువు అవ్వగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.
తల్లి తండ్రుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చా..
చదువు పూర్తి చేసుకున్నాక అందరిలా ఉన్నత చదువుల కోసం ఆలోచిస్తున్న సమయంలో నాలోని ప్రతిభను గుర్తించిన స్నేహితులు సినిమాలో నటించమని సలహా ఇచ్చి నాకు నటనపై ఆసక్తి కలిగించారు. నాకు సినిమాలపై కలిగిన ఆసక్తిని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు నిరుత్సాహపరచకుండా.. నన్ను సినిమా రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించి మరింత ముందుకు పోయేలా కృషి చేస్తున్నారు.
నా అభిమానులే నా బలం
సాధారణంగా సినీ పరిశ్రమలో నటి,నటులకు ప్రేక్షకులు తమ నటనను గుర్తించినప్పుడు కలిగే ఆనందం చిత్రీకరణకు పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. నేను ఇప్పటి వరకు 20 వరకు లఘు చిత్రాలు,10 వరకు డెమో ఫిలిమ్స్, 4 వరకు వెండి తెర చిత్రాలలో నటించాను. ప్రస్తుతం ఇంకా రెండు సినిమాలలో నటిస్తున్నాను. ఇప్పటి వరకు నేను ముందుకు వెళ్ళడానికి నా అభిమానుల ప్రోత్సాహం ఎనలేనిది. నాలోని ప్రతిభను మెరుగుపర్చుకునేలా చేస్తుంది నా అభిమానులే.. నా అభిమానులే నా బలం బలగం అని నమ్ముతాను.
కథ,క్యారెక్టర్ ని బట్టి స్టోరి ఓకే చెబుతాను
ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్న సినిమా ప్రపంచంలో కొన్ని కథలు ఇబ్బందికరంగా ఉన్నవి, క్యారెక్టర్ పరంగా ప్రేక్షకుల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించే సినిమాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే కథలు,ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని కల్పించే సినిమాలకు ప్రాధాన్యతను ఇస్తాను. కొందరు నిర్మాతలు, దర్శకులు పెట్టే కొన్ని షరతుల కారణంగా రెండు మూడు పెద్ద సినిమాలను కూడా తిరస్కరించాను.
కొత్త కాన్సెప్ట్ తో దర్శిని
ఈ నెల 17 న ధియేటర్లలో దర్శిని సినిమా విడుదల అయ్యింది.ప్రస్తుతం ఇంకా ధియేటర్లలో నడుస్తుంది. దర్శిని సినిమా ఒక కొత్త కాన్సెప్ట్ తో.. రేపు ఏం జరగబోతుందో ఈ రోజు తెలుస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తీయడంతో కొత్త టీమ్ అయిన ఓకే చెప్పి కథానాయికగా చేసాను. అందులో పాత్ర నాకు బాగా నచ్చింది. సాధారణంగా కొత్త టీమ్ అంటే వెనుకడుగు వేస్తారు కానీ కాన్సెప్ట్,క్యారెక్టర్ నచ్చడంతో నటించాను.చాలా మంది అభిమానులు,ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ప్రశంసించారు.పాత్రకు తగ్గట్టుగా పరిపూర్ణంగా నటించాను అని డైరెక్టర్ కూడా ప్రశంసించారు. చాలా మంచి అభిప్రాయం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది.
కొంతమంది మీడియా వారు నా నటనపై నెగెటివ్ గా రాశారు. అయినప్పటికీ అభిమానుల నుండి మంచి స్పందనే లభించింది.
ప్రత్యేక స్థానం కోసమే నా ప్రయత్నం
ఈ రంగస్థలంలో ఎందరో ప్రతిభగల కళాకారుల మధ్య నాకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను.నా ప్రయత్నంలో నా విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తాను.నన్ను నన్నుగా అభిమానించే ప్రేక్షకులకు మరిన్ని సినిమాలతో అలరిస్తూ ముందుకు వస్తా.
రంగస్థలంలో తనకంటూ ఓ ముద్ర వేసుకొని ముందుకు వెళ్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని కోరుకుందాం.