ఐకెపి విఓఏలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ` పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్ తెలుగు గళం : ఐకెపి విఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు (తేది: 28062024)న రాష్ట్ర అధ్యక్షులు కె. రాజ్‌కుమార్ అధ్యక్షతన సిఐటియు సెంట్రల్ సిటీ ఆఫీస్‌లో జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐకెపి విఓఏలకు కనీస వేతనం రూ.18,000/-లు ఇస్తామని ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికీ 7 నెలలు కావస్తున్నా మేనిఫెస్టోలో పొందుపర్చిన ఏ ఒక్క డిమాండ్ కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, మహిళలకు ఆర్ధిక చైతన్యం కల్పిస్తూ ప్రభుత్వ పథకాలను క్రింది వరకు తీసుకెళ్ళడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఐకెపి విఓఏలను విస్మరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్ మాట్లాడుతూ మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని, కానీ విఓఏల బ్రతుకులు ఏమీ మారలేదని, విఓఏలకు సెర్ఫ్ నుండి కేవలం రూ.5,000/`ల గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు.
యూనియన్ గౌరవాధ్యక్షురాలు ఎస్వీ. రమ మాట్లాడుతూ 20 సం॥రాల నుండి గ్రామాలలో మహిళల అభ్యున్నతికి మహిళ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడానికి వారికి అవగాహన కల్పిస్తున్నారని, లోన్స్ ఇప్పించి తిరిగి సక్రమంగా లోన్స్ చెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నారని, డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తూ ఎస్‌హెచ్‌జి లైవ్ మీటింగ్ పెట్టి అన్ని సంఘాలు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారని, దీర్ఘకాలికంగా ఆందోళనలు నిర్వహిస్తున్నా గత ప్రభుత్వం స్పందించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించడం లేదన్నారు. పైగా ఐకెపి విఓఏల మీద ఎపిఎంలు, సిసిలు ఒత్తిడిలకు గురి చేస్తూ పని భారం మోపుతున్నారు. గ్రేడిరగ్ పేరుతో జీతాలు రాకుండా ఆపేస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సెర్ప్‌తో సంబంధం లేని పనులు చేయించవద్దని, వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సుమలత, సుధాకర్, అంజి, వెంకటయ్య, రమేష్, వసియా బేగం, జ్యోతి, శోభారాణి, శరత్‌కుమార్, దుర్గయ్య, సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ, రాజేందర్, కవిత తదితరులు పాల్గొన్నారు.