రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో పీఏసీఎస్ చైర్మన్ సంపెల్లి సర్సింగారావు అధ్యక్షతన నిర్వహించిన రైతుల మహాజన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీ అమలు జరుగుతుందని తెలిపారు. ఆగష్టు 15 లోపు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తుండటమే రైతు ప్రభుత్వానికి గొప్ప నిదర్శనమని అన్నారు. ఈ సమావేశాలల్లో పాల్గొన్న పలువురు పలు గ్రామాల రైతులు మాట్లాడుతూ.. ఐదెకరాల నుండి పదెకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం నుండి రైతు భరోసా పథకం అందేలా చూడాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా, మరికొందరు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని కోరారు. వాస్తవంగా సాగు చేసుకునే రైతులతో పాటు కౌలు రైతులకు సహాయం చేసి, రైతు భీమాను కొనసాగించేలా చూడాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ తమ సూచనలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.