హాస్టళ్ళలో రాత్రి బస చేస్తానన్న ఎమ్మెల్యే జీఎస్సార్
ప్రజా పాలనలో సీఏం రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రైవేటుకు ధీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అందుకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు అంచనాలు తయారుచేసి ఇవ్వాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు మూడు గంటల పాటు భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడివోసి మీటింగ్ హాల్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో పలు కళాశాలల ప్రిన్సిపాల్స్ స్కూళ్ళలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని స్కూళ్ళలో వసతులు కల్పనకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అధిక నిధులు ఇస్తున్నట్లు తెలిపారు.
ఎస్సి, బిసి, గిరిజన, మైనార్టీ, కెజిబివి పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకు యుద్ద ప్రాతిపదికన ప్రతిపాదనలు అందచేయాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రహరీ గోడ తక్కువగా ఉండటం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నదని కోతులు రాకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.అన్ని వసతి గృహాల్లో సోలార్ ప్లాంట్, మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.పలు స్కుళ్ళల్లో సిబ్బంది అవసరం ఉందని, ఖాళీల భర్తీకి చర్యలు లిఖితపూర్వకంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.విద్యార్థుల సంఖ్యను బట్టి అదనపు మరుగుదొడ్లు, తరగతి గదులు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాధాన్యత వారీగా పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఇంజినీర్లు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైదానం పరిశుభ్రం చేపించాలని, గోడలకు సున్నాలు వేయించాలని సూచించారు.పనులు జాప్యం కాకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. విద్యుత్ సమస్య శాశ్వత పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారుల ద్వారా ప్రత్యేక ఉప కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తున్నదని విద్యుత్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ధోభి ఘాట్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సమస్య పరిష్కారానికి అంచనాలు తయారు చేయాలని అన్నారు.ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపించాల్సిన బాద్యత ఉందని పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.త్వరలోనే వసతి గృహాలల్లో విద్యార్థుల సమస్యలు పరిశీలనకు రాత్రి బస చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు