సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు (తేది: 07-03-2025)న లేబర్ కమీషనర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా జరిగింది
సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు (తేది: 07-03-2025)న లేబర్ కమీషనర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి తదితర జిల్లాల నుండి కార్మికులు హాజరయ్యారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ధర్నాకు అధ్యక్షత వహించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎం. వెంకటేష్, జె. చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఈశ్వర్రావు, వి.ఎస్. రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, జె. కుమారస్వామి, పి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26,000/-లకు పెంచాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సం॥ల కాలంలో వేతనాలు పెంచకుండా కాలయాపన చేసి మోసం చేసినందుకు కార్మికవర్గం తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తే బిఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు కూడా పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు సవరించకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 2021లో విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్లను గెజిట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్ట్రాయిడ్ ఫార్ములా, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కనీస వేతనాలు నిర్ణయం చేయకుండా అధికారులు బేసిక్ మరియు డిఏలను కలిపి కొత్త బేసిక్ గా నిర్ణయించడం అన్యాయమన్నారు. ప్రస్తుత ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ కనీస వేతనాలు నిర్ణయించడం కోసం 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం నియమించే కనీస వేతనాల సలహా మండలిలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఐఎన్టియుసి, కాంగ్రెస్ వారితో నింపుకోవడం దారుణం. తక్షణమే బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిఐటియు రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న జె. వెంకటేష్, ఎం. వెంకటేష్, జె. చంద్రశేఖర్ లు ప్రసంగించారు. అనంతరం జాయింట్ కమీషనర్ ఆఫ్ లేబర్ రంగారెడ్డి జోన్ వారిని యూనియన్ రాష్ట్ర ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఎస్. రావు కార్మిక శాఖ అధికారులు చెప్పిన అంశాలను కార్మికుల దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ అధ్యక్షులు జె. కుమారస్వామి వందన సమర్పణ చేశారు.