
ఈ69న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం & దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టాభూముల పై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి,ఆర్డీవో రాథోడ్ రమేష్, ల్యాండ్ సర్వే విభాగం ఏడి శ్రీనివాసులు,ధర్మసాగర్ తహసీల్దార్ గుత్తికొండ సదానందం,అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు,తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పలు గ్రామాలకు చెందిన రైతులకు పట్టాపాస్ పుస్తకాలు ఉండి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో లేని వారి భూములను కూడా అటవీ శాఖ తమ ఆధీనంలోకి తీసుకోగా వాటిని తిరిగి గుర్తించి ఆ పట్టా భూములను రైతులకు స్వాధీన పరచాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు చెందిన 45 ఎకరాల వ్యవసాయ భూమిని వారి ఆధీనంలోనే ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో కుడా పీవో అజిత్ రెడ్డి, వేలేరు తహసీల్దార్ కోమి, అటవీ, సర్వే, ఇతర అధికారులు పాల్గొన్నారు.