
ఈ69న్యూస్ హనుమకొండ
హాస్టల్ లో విద్యార్థులకు సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.బుధవారం హనుమకొండ నయీమ్ నగర్ లోని బీసీ సంక్షేమ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు,సౌకర్యాలు ఎలా ఉన్నాయని బీసీ సంక్షేమ అధికారి రామ్ రెడ్డి,హాస్టల్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.వంట గదిలో విద్యార్థుల కోసం తయారుచేసిన భోజనాన్ని తనిఖీ చేశారు.మెనూ చార్ట్ ను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమై ఏయే కళాశాలల్లో చదువుతున్నారు,ఏయే ప్రాంతాలకు చెందినవారు,కళాశాలలకు ఎలా వెళ్తారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.స్టడీ అవర్స్,ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం భోజనం గురించి విద్యార్థులను కలెక్టర్ అడిగారు.వాటర్ సప్లై ఎలా ఉంది,ఫుడ్ కమిటీ ఉందా,కొత్త మెనూ ప్రకారం హాస్టల్ లో సదుపాయాలు అందిస్తున్నారా,ఫ్రూట్స్ ఇస్తున్నారా,ఏవైన సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..కళాశాలకు వెళ్లి వచ్చిన తరువాత హాస్టల్ వార్డెన్ అనుమతి లేనిదే బయటకు వెళ్లొద్దన్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అన్నారు.