
TSRTC స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో ధర్నాలు
2022 ఏప్రిల్ నుండి రావల్సిన టెర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించాలి.
రిటైర్డ్ ఉద్యోగి, స్పాజ్ ను సూపర్ లక్సరీ బస్ లలో ఉచిత ప్రయాణం కు అనుమతించాలి.రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని
TSRTC స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో ధర్నాలు జయప్రదం.TGSRTC లో దశాబ్దాల పాటు పని చేసి ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా RTC యాజమాన్యం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నది. తక్షణమే వారి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4 న అన్ని డిపోల ముందు ధర్నాలు జరపాలని SWF ఆధ్వర్యంలో మార్చి 20 న జరిగిన రాష్ట్ర సదస్సుతీర్మాణం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని డిపోల ముందు SWF కమిటీ ల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ఆ ధర్నాలాలో రిటైర్డ్ కార్మికులు కూడా అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
TGSRTC బస్ భవన్ వద్ద SWF ప్రధాన కార్యదర్శి V. S. RAO, ప్రచార కార్యదర్శి P. R. రెడ్డి, కార్యదర్శి G. R. రెడ్డి, ఉపాధ్యక్షులు A. V. RAO లు నాయకత్వం వహించగా, మహబూబ్‌నగర్ లో SWF అధ్యక్షులు వీరాంజనేయులు, వరంగల్ రీజియన్ లో ఎల్లయ్య, CH. రాంచందర్, ఆదిలాబాద్ లో ఉపాధ్యక్షులు M. B. RAO, కరీంనగర్ లో మల్లయ్య, శ్రీనివాస్, ఖమ్మం లో రీజియన్ కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు A. V. LOO తదితరులు నాయకత్వం వహించారు. ధర్నా అనంతరం హెడ్ ఆఫీస్ లో VC& MD గారి OSD భాను ప్రసాద్ గారికి వినతిపత్రం ఇచ్చి, దాని కాపీ ని FA& CAO గారికి ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఇచ్చిన వారిలో VS RAO, AV RAOమరియు రవీందర్ రెడ్డి ఉన్నారు. అలాగే అన్ని డిపో మేనేజర్స్ కార్యాలయా లలో వినతిపత్రం ఇచ్చారు.
ఆర్టీసి సంస్థలో దశాబ్దాల కాలం సంస్థ అభివృద్ధి కోసం రక్తం చెమటగా మార్చి పని చేసి వయసు పరిమితుల రీత్యా సంస్థ నుండి ఉద్యోగ విరమణ చేసి జీవనం సాగిస్తున్న వారు తెలంగాణ రాష్ట్రంలో షుమారు 24,000 మంది వుంటారు.
పని చేసిన కాలంలో చాలీచాలని జీతంతో కూడా సంస్థ అభివృద్ధి కోసం అంకిత భావంలో పని చేశారు. అలా ఆర్టీసికి సేవ చేయడానికి వారి కుటుంబ సభ్యులు అనేక త్యాగాలు చేశారు. వారు చేసిన త్యాగాలను యాజమాన్యం గుర్తుంచుకొంటుందని, తమ జీవితాలకు ఆసరాగా వుంటుందని భావించారు.
ఆర్టీసి కార్మికులకు ప్రభుత్వ పెన్షన్ స్కీం లేదు. కేవలం పి.ఎఫ్ లో అంతర్భాగంగా వున్న ఇపిఎస్ స్కీం ద్వారా పొందే నామమాత్రపు పెన్షన్ మాత్రమే పొందుతున్నారు. దీంతోపాటు స్టాఫ్ రిటైర్మెంటు బెనిఫిట్ స్కీం ద్వారా కొంతమొత్తం ఆర్ధిక సహాయం పొందుతూ, అతి కష్టంపైన తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇన్ని దశాబ్దాలు పని చేసిన తర్వాత కూడా తమ జీవనం ఇంత దుర్భరంగా వుండటానికి కారణం ఎవరో తెలియక తమపైన తామే కోపం తెచ్చుకుంటూ బ్రతుకీడుస్తున్నారు.
ఆర్టీసి కార్మికుడు రిటైరైన తర్వాత ఆర్టీసి యాజమాన్యం నుండి తమకు వచ్చే అదనపు ఆదాయం ఏమీ లేవు. (1)పి.ఎఫ్ లో దాచుకొన్న సొమ్ము. (2) చట్టం ప్రకారం గ్యాట్యూటీ. (3) రిటైర్మెంటు నెల జీతం (4) ఎస్బిటిలో తాను జమ చేసిన డబ్బులు వడ్డీతో (5)300 లోపు లీవులు ఎన్ క్యాష్మాంటు చేసి డబ్బులు పొందడం (6) వేతన ఒప్పందాల సమయంలో రావలసిన అరియర్స్ (7) సిసిఎస్ లో ఉద్యోగి దాచుకున్న డబ్బులు తిరిగి పొందడం.
వీటన్నింటిలో ఏదీ ఆర్టీసి సంస్థ, ప్రభుత్వం కాని ఉట్టి పుణ్యానికి ఇచ్చేది ఏమీలేదు. 2019 లో సంస్థలో రిటైర్మెంటు వయసు 60కి పెంచిన తర్వాత 2022 జనవరి నుండి మాత్రమే రిటైర్మెంటు అయ్యారు. కేవలం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు మాత్రమే టెర్మినల్ లీవు ఎనా క్యాష్మెంటు చెల్లించారు. గత 3 సం॥లుగా రిటైరైన ఏ ఒక్కరికి లీవు ఎనాక్యాష్మెంటు చెల్లించలేదు. ఫలితంగా ఆ కుటుంబాలు తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతో ఇంతో ఆర్థికంగా అసరాగా వున్న ఎస్ఆర్ఎస్ కూడా మూసివేతకు సిద్ధం చేస్తూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అనేక డిపోలలో / రీజియన్లలో గ్రాట్యుటీ, రిటైర్మెంటు నెల జీతం కూడా చెల్లించలేదు. సిసిఎస్ కు డబ్బులు ఆర్టీసి చెల్లించనందున 12 నెలలుగా తమ డిపాజిట్లుపై వడ్డీ కూడా పొందలేకపోతున్నారు. అలాగే 2017 వేతన ఒప్పందం అమలు అయ్యే రిటైరైన వారి సంఖ్య 15,000 మంది ఉంటారు. వారికి ఇంతవరకు ఆర్.పి.ఎస్ 2017 ఫిక్సేషన్ చేసి అమలు చేయలేదు. వారికి అరియర్స్ ఎంత వస్తాయో, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పడం లేదు.
ఇపిఎఫ్ లో సభ్యులుగా వున్న వారికి హయ్యర్ పెన్షన్ పొందే చివరి అవకాశం సుప్రీం కోర్టు ద్వారా పొందారు. ఈ రాష్ట్రంలో ఎస్ డబ్ల్యుఎఫ్ సిఐటియు చేసిన కృషి ఫలితంగా పీనల్ వడ్డీ లేకుండానే ఆర్పిఎస్ 2013, ఆర్పిఎస్ – 2017 అరియర్స్‌ను ఇపిఎస్ కు చెల్లించే అవకాశం 18.01.2025న ఇపిఎఫ్ ఇచ్చింది. అది అమలయితే వారి పెన్షనబుల్ సాలరీ పెరిగి, ఆ మేరకు వారు పొందే పెన్షన్ పెరిగే అవకాశం వుంది. యాజమాన్యం 2017 అరియర్స్ చెల్లించనందున ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. రిటైరైన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు 3 రకాలుగా వున్నాయి. (1) ఆర్టీసి పరిష్కరించాల్సినవి, (2) కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావలసినవి. (3) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయం పొందేవి. వాటి పూర్తి వివరాలను ఇక్కడ పొందపరుస్తున్నాము. ఆర్టీసి యాజమాన్యం చొరవ చేసి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము.
ఆర్టీసి సంస్థ పరిష్కరించాల్సిన సమస్యలు :
(1) రిటైరైన కార్మికులకు రావలసిన టెర్మినల్ లీవు ఎన్ క్యాష్మాంటును రిటైరైన నెలలోపు చెల్లించాలి. 2022 ఏప్రిల్ నుండి రావలసిన వారికి వెంటనే చెల్లించాలి.
(2) రిటైరైన నెలలోపు లోనే గ్యాట్యుటీ తో సహా అన్నీ చెల్లించాలి.
(3) 2017 పే స్కేలును అమలు చేసి, అరియర్స్ వెంటనే చెల్లించాలి.
(4) 2013, 2017 పే స్కేల్‌కు సంబంధించి ఇపిఎస్ కంట్రిబ్యూషన్స్ చెల్లించి, రివైజ్డ్ పి.పి.ఓ లు కోసం కృషి చేయాలి.
(5) 2021 పే స్కేలు ప్రకటించి, అరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలి.
(6) మెడికల్ అటెండెన్స్‌కు (ఆర్.ఇ.ఎం.ఎస్) సంబంధించి సర్క్యులర్ నెం. 15/2024, 20.07.2024 లో పేరా నెం. 5,6,7,8 లను తొలగించాలి. రిటైరైన ఉద్యోగులకు వైద్య సదుపాయాల సర్క్యులర్ 14/2015 ను ప్రామాణికంగా తీసుకోవాలి.
(7) రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం (ఆర్.ఇ.ఎం.ఎస్) ఉద్యోగి, స్పౌజ్‌కు చెరో 10 లక్షలకు పెంచాలి (ఉమ్మడిగా 20 లక్షలు).
(8) రిటైర్డ్ ఉద్యోగి మరియు స్పౌజ్లకు సూపర్ లగ్జరీ వరకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలి (రాత్రి పూట సర్వీసులన్ని సూపర్ లగ్జరీ, ఎసి బస్ లే వుంటున్నందున ఇది తక్షణ అవసరంగా వుంది).
(9) 2017 అరియర్స్ తో డి.ఎ. అరియర్స్ చెల్లింపును ముడిపెడ్తూ ఇచ్చిన సర్క్యులర్ నెం. 11/2024, 07.06.2024 ను సవరించాలి.
కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సినవి
(1) కనీస పెన్షన్‌ను 9000గా నిర్ణయించాలి.
(2) ఇపిఎస్ కు కూడా కరువు భత్యం, వేతన ఒప్పందాలను లింకు చేయాలి.
(3) చివరి నెల జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి.
(4) 2022 నవంబర్ 4న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి అర్హులైన అందరికి హయ్యర్ పెన్షన్‌ను చెల్లించాలి.
(5) క్లారిఫికేషన్స్ పేరుతో పంపిన లేఖలకు జవాబు ఇవ్వలేదనే పేరుతో జాయింటు డిక్లరేషన్‌ను రిజెక్టు చేయరాదు. అలా చేసిన వాటిని తిరిగి అనుమతించాలి.
(6) డిమాండు నోటీసు వచ్చిన సమాచారం తెలియక అవకాశం కోల్పోయిన వారికి మరొక అవకాశం ఇవ్వాలి.
(7) చట్ట విరుద్ధంగా అమలు చేస్తున్న ‘హయ్యర్ పెన్షన్‌లో దామాషా పద్ధతిని’ రద్దు చేయాలి. చట్ట ప్రకారం రావలసిన పెన్షన్ ను చెల్లించాలి.
(8) హయ్యర్ పెన్షన్‌ను చెల్లింపులో జాప్యం నివారించి, తక్షణమే రివైజ్డ్ పి.పి.ఓ లు జారీ చేయాలి.
(9) 2014 వరకు హయ్యర్ పెన్షన్ కోసం రికవరీలు చేసి, రిజెక్టు చేయబడ్డ 16,307 (ఉమ్మడి రాష్ట్రంలో) మందికి రావలసిన డబ్బులను చక్రవడ్డీతో చెల్లించాలి.
(10) హయ్యర్ పెన్షన్ అరియర్ను ఇన్‌కంటాక్స్ పరిధి నుండి తొలగించాలి. (ఫైల్ నెం. Pension//1/PoHW/2024-25/efile-951977, Dt. 18.01.2025)
(11) రిటైర్మెంటు అయ్యే వరకు హయ్యర్ పెన్షన్ కోసం ఇపిఎస్ కు చెల్లించినప్పటికి హయ్యర్ పెన్షన్ పొందలేని వారి సమస్యను వెంటనే పరిష్కరించాలి.
రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయం :
(1) ఆర్ సి నుండి రిటైరైన వారికి ఆసరా పెన్షన్‌ను గ్రాంటు చేయాలి.
(2) తెల్లరేషన్ కార్డు జారీచేయాలి.