swf rtc
నిన్న ‘మే డే’ ఉత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసి కార్మికుల సమ్మెపై స్పందించటాన్ని ఆర్టీసి ఎస్ డబ్ల్యుఎఫ్ స్వాగతిస్తున్నదని SWF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వి.ఎస్. రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసి కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిగారికి SWF రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఆర్టీసి కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేకసార్లు రవాణా శాఖ మంత్రి గారికి, ఆర్టీసి యాజమాన్యానికి వినతిపత్రాలను, ఆర్టీసి యూనియన్లు సమర్పించాయి. అనేక రూపాలలో ఆందోళనలు నిర్వహించాయి. గత 18 నెలలుగా ప్రభుత్వం నుండి కాని, ఆర్టీసి యాజమాన్యం నుండి కాని ఎలాంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2013 బాండ్ల డబ్బులు విడుదల చేయటం, 2017 వేతన సవరణ జరపటాన్ని ఆర్టీసి కార్మికులు గుర్తుంచుకుంటారని వారు అన్నారు. వేతన సవరణ ద్వైపాక్షిక చర్చ ల ద్వారా జరపటం చట్టబద్ధమని, అయితే 2017 వేతన సవరణ ఏకపక్షంగా జరిగిందని, అరియర్స్ ను రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని ప్రకటించి తీరని అన్యాయం చేసిందన్నారు. అందులో అలవెన్సులు వంటివి ఇంకా అనేకం పరిష్కరించవలసిన సమస్యలు ఉన్నాయని వారు అన్నారు. మరో రెండు వేతన సవరణలు, 2017 ఏరియర్స్, పెరిగిన పనిభారం, ఉద్యోగ భద్రత, అధికారుల వేధింపులు లాంటి అనేక సమస్యలతో ఆర్టీసి కార్మికులు ఇబ్బందిపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులు చనిపోయినా, ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా సెలవులు కూడా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని, యూనియన్ నాయకులు స్పందించి అధికారులతో మాట్లాడబోతే యూనియన్లు లేవని చెబుతున్నారని వారు అన్నారు. ఇటువంటి వైఖరి వల్లనే కార్మికులలో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతున్నదని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
సమస్యలపై సమ్మె దాకా వెళ్ళొద్దని, రవాణా శాఖా మంత్రితో చర్చించమంటూ ముఖ్యమంత్రి చెప్పటం మంచిదేనని, అయితే సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినప్పుడే యూనియన్లను, మేనేజ్మెంటును కూర్చోబెట్టి చర్చిస్తే సమ్మె దాకా వెళ్ళాల్సిన అవసరమే రాదని, సమ్మె చేయాలన్న కోరిక ఏమీ కార్మికులకు ఉండదని, ఎక్కడైనా విధిలేని స్థితిలోనే సమ్మెకు వెళతారని, ఇప్పుడు కూడా చర్చలకు నిర్దిష్ట ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం నుండి రాలేదని వారు అన్నారు.
గత ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఆర్టీసి యూనియన్లను నియంత్రించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, యూనియన్ల కార్యకలాపాలు పునరుద్ధరిస్తుందని, ఆర్టీసి కార్మికులు మనసారా నమ్మి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ యూనియన్ల కార్యకలాపాలు ఇంకా అనుమతించకపోవటంతో తమ సమస్యలు చెప్పుకొనే వేదికలు లేకుండా పోయాయని, కార్మికులు ఎంతో ఆశాభంగం చెందారని ముఖ్యమంత్రి గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తక్షణమే ప్రభుత్వం ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి, సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.