అసత్యపు ఆరోపణలు మానుకోవాలి
రెండేళ్లలో రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు–మరో రూ.150 కోట్ల పనులకు జీవోలు
విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై కొందరు రాజకీయ నేతలు కావాలనే అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను వెంటనే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.ఆదివారం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని 30 వార్డుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధిదీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు.ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు.భూపాలపల్లి పట్టణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో మరో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వ జీవోలు కూడా తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నిధులతో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నేతలు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన వారు, రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం ప్రజలకు హానికరమని అన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలకు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ధీమా వ్యక్తం చేశారు. 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని, ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.